
మంట కలిసిన మానవత్వం!
కళ్యాణదుర్గం: మానవత్వం మంట కలిసింది. సహజ మరణమో?... లేక హత్యనో? అయిన వారెవ్వరూ లేని అనాథ శవమో? అందరూ ఉన్నా అంత్యక్రియలు చేయకుండా వదిలేసిన మృతదేహమో? వాస్తవం నిర్ధారణ కాలేదు కానీ.. కళ్యాణదుర్గం సమీపంలోని కన్నేపల్లి రోడ్డులో ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఓ మృతదేహం జంతువులకు ఆహారమైంది. మంగళవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు పూర్తిగా కుళ్లిన మృతదేహాన్ని గుర్తించి సమాచారం ఇవ్వడంతో స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనాథలకు సైతం మానవత్వంతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అయితే ఇందుకు విరుద్ధంగా ఓ మృతదేహాన్ని ఖననం చేయకుండా శ్మశానంలో వదిలేసి వెళ్లడం ప్రస్తుతం కళ్యాణదుర్గంలో చర్చనీయాంశమైంది.
శవాన్ని పీక్కుతున్న జంతువులు
దాదాపు 50 ఏళ్లకు పైబడిన వ్యక్తి మృతదేహాన్ని ఓ తెల్లని వస్త్రంలో చుట్టి నాలుగైదు రోజుల క్రితం శ్మశాన వాటికలో వదిలేసినట్లుగా అక్కడి ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. దీంతో ఆ మృతదేహాన్ని జంతువులు పీక్కు తిన్నాయి. దీంతో మృతదేహం పురుషుడిదా? మహిళదా? అనే విషయం తెలియకుండా పోయింది. దుర్వాసన వెదజల్లుతుండడంతో మంగళవారం అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు గాలింపు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. జంతువులు పీక్కు తినడంతో సగానికి పైగా అస్థిపంజరం మిగిలింది.
సహజ మరణమా... లేక హత్యనా:
శ్మశాన వాటికలో లభ్యమైన మృతదేహం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సహజ మరణమా? లేక హత్యనా? అనేది తెలియాల్సి ఉంది. సహజ మరణమే అయితే మృతదేహాన్ని ఖననం చేయకుండా ఎందుకు వదిలేశారు అనేది తేలాల్సి ఉంది. ఈ అంశంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. కాగా, హిందూ శ్మశాన వాటికలో పడేసిన మృతదేహంపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు నిగ్గు తేల్చాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ తాలూకా అధ్యక్షుడు చెలిమప్ప డిమాండ్ చేశారు. సహజ మరణమా లేక, ఎవరినైనా హతమార్చి అక్కడ పడేశారా అనే అనుమానాలు ఉన్నాయన్నారు.
హిందూ శ్మశాన వాటికలో
వదిలేసిన మృతదేహం
జంతువులు పీక్కుతినడంతో మిగిలిన అస్థిపంజరం
గుర్తించిన గొర్రెల కాపరులు