మాఫియా డాన్‌ల ఉలికిపాటు | - | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్‌ల ఉలికిపాటు

Aug 27 2025 8:49 AM | Updated on Aug 27 2025 8:49 AM

మాఫియా డాన్‌ల ఉలికిపాటు

మాఫియా డాన్‌ల ఉలికిపాటు

బియ్యం అక్రమ రవాణాకు

తాత్కాలిక బ్రేక్‌

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రేషన్‌ బియ్యం మాఫియా డాన్‌లు ఉలిక్కిపడ్డారు. ఈనెల 21న సాక్షిలో ‘మాఫియా గుప్పిట్లో రేషన్‌’ శీర్షికతో వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారిగా బియ్యం మాఫియా డాన్‌లు అప్రమత్తమయ్యారు. చిన్న చిన్న సరఫరాదారులందరూ కలుగుల్లోకి వెళ్లినట్లు తెలిసింది. గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రాలేదని, అందరూ కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండాలని డాన్‌ల నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. బియ్యం సేకరించి గోడౌన్‌లకు చేర్చే ఏజెంట్ల మధ్య అనైక్యత కారణంగానే మీడియాకు సమాచారం వెళ్లిందని మాఫియా డాన్‌లు మండిపడ్డారు. ‘మీ మధ్య ఉన్న వివాదాల కారణంగా సమాచారం బయటకు వెళుతోంది. జాగ్రత్తగా లేకపోతే మనకు తీవ్ర నష్టం జరుగుతుంది’ అంటూ హెచ్చరించారు. సేకరించిన బియ్యాన్ని ఏజెంట్ల దగ్గరే మరికొన్ని రోజులు ఉంచుకోవాలని సూచించారు.

వారం రోజులు డంప్‌ల జోలికి వెళ్లొద్దు..

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో నిల్వ ఉంచిన బియ్యం డంప్‌ల జోలికి వెళ్లద్దని మాఫియా భాగస్వాములు అందరూ నిర్ణయించినట్టు తెలిసింది. నాలుగైదు రోజులు పోలీసులు, విజిలెన్స్‌ అధికారులు, సివిల్‌ సప్లయీస్‌ అధికారులతో సమావేశం నిర్వహించుకుని, తర్వాత సరఫరా చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే చెక్‌పోస్ట్‌ల అధికారులతోనూ, విజిలెన్స్‌ వారితోనూ టచ్‌లోకి వెళ్లినట్టు సమాచారం.

ఇకపై సోమందేపల్లికే రండి..

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి కేంద్రంగా బియ్యం మాఫియా నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే డంప్‌లు మాత్రం అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఇకపై డంప్‌లకు కాకుండా నేరుగా సోమందేపల్లికి రేషన్‌ బియ్యం తీసుకురావాలని మాఫియా డాన్‌ సరఫరాదారులకు చెప్పాడు. వాహనాలు డంప్‌ల వద్దకు పంపలేనని, సోమందేపల్లి నుంచి అయితే బంగారుపేట, పావగడకు సులభంగా రవాణా చేసుకోవచ్చనేది ఆలో చనగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఇటీవల బియ్యం అక్రమ రవాణాకు తాత్కాలిక బ్రేక్‌ పడినట్లు తెలుస్తోంది. మాఫియా డాన్‌గా చెప్పుకుంటున్న ఆర్కే నుంచి మళ్లీ ఆదేశాలు రాగానే రవాణా సాగిస్తామంటున్నారు. కాగా.. బియ్యం అక్రమ రవాణా పెద్ద ఎత్తున జరుగుతున్నా పోలీసులు, విజిలెన్స్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారుల్లో మాత్రం చలనం లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement