
విఘ్నేశ్వరుడు ప్రతి ఇంటా సంతోషం నింపాలి
● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: వినాయక చవితిని అందరూ సంతోషంగా జరుపుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజల విఘ్నాలు తొలగి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలన్నారు. విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, విజయాలు సిద్ధించాలన్నారు. పర్యావరణ హితంగా వినాయక చవితి ఉత్సవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని కోరారు.
జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు
● కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్
అనంతపురం అర్బన్: జిల్లా ప్రజలకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. గణనాథుని కరుణా కటాక్షాలతో జిల్లా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఆనందమయ జీవితం గడపాలని పేర్కొన్నారు.
మట్టి గణపతులే శ్రేష్టం
అనంతపురం కల్చరల్: పర్యావరణానికి హితం కల్గించే మట్టి గణపతులనే పూజల్లో వాడాలని కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ సూచించారు. మంగళవారం స్థానిక రామ్‌నగర్‌లోని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయంలో మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) వాడకంతో పర్యావరణం దారుణంగా దెబ్బతింటుందన్నారు. పీఓపీతో చేసిన విగ్రహాలను వినియోగించరాదన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో పీసీబీ ఇంజినీర్ మునిప్రసాద్, తహసీల్దార్ హరికుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పండుగ ప్రశాంతంగా జరుపుకోవాలి
● ఎస్పీ జగదీష్
అనంతపురం సెంట్రల్: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ప్రజలకు ఎస్పీ పి. జగదీష్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. మండపాల వద్ద, నిమజ్జన సమయంలో జాగ్రత్తలు పాటించా లని కోరారు. ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. మందుగుండు సామగ్రి ఉంచరాదని సూచించారు. చిన్నారులకు అందేలా వైర్లను ఏర్పాటు చేయరాదన్నారు. నిర్వహణ కమిటీ ప్రతినిధులు విధిగా కాపలా ఉండాలన్నారు. అర్ధరాత్రి వరకూ కాకుండా పగటి సమయంలో నిమజ్జనం జరుపుకోవాలని కోరారు. చిన్నారులను వెంట తీసుకెళ్లరాదన్నారు.
రేపు ఈపీఎఫ్‌ఓ సేవలపై అవగాహన
అనంతపురం సిటీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) వినియోగదారులకు అవగాహన కల్పించే నిమిత్తం ఈ నెల 28న ‘నిధి ఆప్కే నికత్ 2.0’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ కడప రీజినల్ పీఎఫ్ కమిషనర్–1 కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 27న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని 28వ తేదీకి కార్యక్రమాన్ని మార్చినట్లు పేర్కొన్నారు. తాడిపత్రి మండలం భోగసముద్రం వద్ద ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు కొత్తగా కవర్ అయిన సంస్థల ప్రతినిధులకు ఓరియంటేషన్ ఉంటుందన్నారు. 11 నుంచి 11.30 వరకు యజమానులు, కాంట్రాక్టర్లతో ఆన్‌లైన్ సేవలు,చందాదారులు /పెన్షనర్ల కోసం ఆన్‌లైన్ సేవలు, మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు కొత్త కార్యక్రమాలు, సంస్కరణలపై అవగాహన, 2 నుంచి 2.30 వరకు మినహాయింపు పొందిన సంస్థలతో ముఖాముఖి ఉంటుంది.

విఘ్నేశ్వరుడు ప్రతి ఇంటా సంతోషం నింపాలి

విఘ్నేశ్వరుడు ప్రతి ఇంటా సంతోషం నింపాలి