
పారా లీగల్ వలంటీర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సెంట్రల్: నల్సా వీర్ పరివార్ సహాయత యోజన –2025 కార్యక్రమంలో భాగంగా లీగల్ సెల్ సర్వీస్ అథారిటీ పారా లీగల్ వలంటీర్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సైనిక సంక్షేమ అధికారి తిమ్మప్ప తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి ఉన్న జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులు, వీరనారీలు సెప్టెంబర్ 5 లోపు దరఖాస్తు చేసుకోవాలి. కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. పూర్తి వివరాలకు 08554–241146లో సంప్రదించవచ్చు.
డీఎస్సీలో ప్రతిభావంతులకు న్యాయం చేయాలి
అనంతపురం ఎడ్యుకేషన్: డీఎస్సీలో ఎంపికై న ప్రతిభావంతులకు న్యాయం చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నీలూరు రమణారెడ్డి, ఎస్.రామాంజనేయులు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రాధాన్యత ఇచ్చిన పోస్టుకు అర్హత సాధిస్తే దానికి మాత్రమే వెళ్లాలనే నిబంధన గుదిబండగా మారిందన్నారు. ఈ నిబంధనను సడలించి వివిధ రకాల పోస్టులకు ఎంపికై న సందర్భంలో అభ్యర్థి ఇష్ట పూర్వకంగా కోరుకునే పోస్టుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపికై న అభ్యర్థులకు ముందస్తుగానే ప్రతి మేనేజ్‌మెంట్‌లోనూ ఖాళీలను ప్రకటించాలన్నారు.
జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు తాడిపత్రి విద్యార్థిని
తాడిపత్రి టౌన్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని గౌసియా జాతీయ స్థాయి క్విజ్ పోటీలకు ఎంపికై ంది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటనారాయణ తెలిపారు. ఏపీ ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి సెప్టెంబర్ 7న ముంబయిలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిందన్నారు. ప్రతిభ చాటిన గౌసియాను కళాశాల అధ్యాపకులు రాజేష్, హరిప్రసాద్, హేమలత, సహ విద్యార్థులు అభినందించారు.
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన పక్కాగా చేపట్టాలి
● కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
అనంతపురం అర్బన్: డీఎస్సీ అభ్యర్థులకు సంబంధించి ఈనెల 28 నుంచి చేపట్టనున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలన ప్రక్రియ పక్కాగా జరగాలని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని చెప్పారు. డీఎస్సీ అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలన, యూరియా నిల్వలు, తదితర అంశాలపై కలెక్టర్ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలమూరు రోడ్డులోని బాలాజీ పీజీ కళాశాలలో నిర్వహించనున్న ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. పరిశీలన ప్రక్రియకు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మల్లికార్జునుడు నోడల్ ఆధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. విద్యాశాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలని చెప్పారు.
యూరియా కొరత రాకూడదు..
జిల్లాలో ఎక్కడా యూరియా కొరత తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులను ఆదేశించారు. కృత్రిమ కొరత నివారించేందుకు వ్యవసాయ, సహకార, మార్క్‌ఫెడ్, పోలీసు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ప్రభావంతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రైవేటు వ్యాపారులు యూరియా ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే నోలీసు ఇవ్వాలని చెప్పారు. అదే క్రమంగా అధిక ధరకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 2న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ఇస్తారన్నారు. జిల్లాకు ఎక్కువ సంఖ్య ‘స్వచ్ఛ ఆంధ్ర’ అవార్డులు వచ్చేలా స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టాలని డీపీఓ, ఇతర శాఖల అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామపంచాతీల్లో ప్రతి రోజూ చెత్త సేకరణ చేపట్ట వివరాలను నమోదు చేయాలన్నారు. నీటి ట్యాంకులు శుభ్రం, క్లోరినేషన్ ప్రక్రియ క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.