
ఆత్మహత్యే శరణ్యం
పుట్లూరు: పింఛన్లు తొలగిస్తే తమకు ఆత్మహత్యే శరణ్యమని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం పుట్లూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. రీ వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించడం అన్యాయమన్నారు. ఆస్పత్రుల్లో వైద్యులు కనీసం తమ వైపు చూడకుండా పంపారని కన్నీటిపర్యంతమయ్యారు. దివ్యాంగులకు సీపీఎం మండల కార్యదర్శి సూరి సంఘీభావం తెలిపారు. పింఛన్లను పునరుద్ధరించకపోతే బాధితులతో కలిసి దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పెద్దయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.