
చవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు సురక్షితంగా, పారదర్శకంగా సాగేలా చూడడమే లక్ష్యమని ఎస్పీ పి. జగదీష్ అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉత్సవాల నిర్వహణకు సంబంధించి అనుమతుల కోసం ప్రత్యేకంగా ganeshustav. net వెబ్‌సైట్ ప్రారంభించామన్నారు. సింగిల్ విండో విధానంలో అనుమతులు పొందాలని సూచించారు. ఇందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత పోలీస్ అధికారి మంటప స్థలాన్ని తనిఖీ చేసి, నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) జారీ చేస్తారని, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే మంటపాలకు అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్నారు.
● పోలీసుల సూచనలిలా... పర్యావరణ కాలుష్యం జరగకుండా మట్టి ప్రతిమలే ప్రతిష్టించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ) విగ్రహాలను వాడరాదు. మంటపాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. విగ్రహ నిమజ్జనం కోసం ప్రభుత్వం గుర్తించిన ఘాట్లను మాత్రమే వినియోగించాలి.
● ప్రతి మంటపం వద్ద సీసీ కెమెరాలు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తదితరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఎటువంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వెంటనే పోలీసు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. ప్రతి మంటపంలో కనీసం 5 నుంచి 10 మంది వలంటీర్లు విధులు నిర్వర్తించాలి. ఉత్సవ కమిటీ సభ్యులు 24 గంటలూ అందుబాటులో ఉండాలి.
● పోలీసు శాఖ సూచించిన మార్గదర్శకాలను పాటించాలి. ఊరేగింపు సమయంలో భక్తి గీతాలు, శాంతి సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలి. ఇతర మతస్తుల మనోభావాలను దెబ్బతీయకండా సోదరభావంతో, పరస్పర గౌరవంతో ఉత్సవాలు జరగాలి. శాంతిభద్రతలను కాపాడటంలో సహకారం అందించాలి.