
తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత!
● ఉచితం మాటున ఇసుక దందా
● నదులను కొల్లగొడుతున్న టీడీపీ నాయకులు
● చేష్టలుడిగి చూస్తున్న అధికారులు
అనంతపురం టౌన్:ఇసుకను ఉచితంగా అందిస్తున్నామంటూ ఊదరగొడుతున్న కూటమి ప్రభుత్వం.. ఆ మాటున ‘పచ్చ’ నేతలకు దోచిపెడుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేస్తూ ‘తమ్ముళ్లు’ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల అండతో ఎక్కడిక్కడ తవ్వేసుకుంటూ భారీగా వెనకేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇసుక దందా సాగుతున్నా అధికార యంత్రాంగం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. ఎద్దుల బండిపై ఇసుకను తరలిస్తేనే పట్టుకుంటున్న పోలీసు, విజిలెన్సు అధికారులు... అదే పెన్నా, వేదావతి, హగరి నదుల పరివాహక ప్రాంతాల నుంచి టిప్పర్లలో తరలిపోతున్న ఇసుక కనిపించడలేదు.
అక్కడ గుంతలే సాక్ష్యం..
శింగనమల మండలం జలాలపురం గ్రామంలోని కూతలేరు వాగును స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ప్రధాన అనుచరులు మింగేశారు. వాగులో ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇసుక తవ్వేసి అమ్మేసుకుంటున్నా అధికార యంత్రాంగానికి ఏమాత్రం పట్టడం లేదు. ఇసుక అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకుంటే తప్ప వెలుగులోకి రానివ్వకుండా అధికార యంత్రాంగం పని చేస్తుండడం గమనార్హం. శింగనమల నియోజకవర్గంలో తరిమెల, యల్లనూరు గ్రామాల్లో మినహా ఎక్కడా ఇసుక రీచ్‌లకు అనుమతులు లేవు. అయినా పెన్నా, కూతలేరు నది పరివాహక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేస్తూ స్థానిక టీడీపీ నేతలు అమ్మేసుకుంటున్నారు. ‘పచ్చ’ నేతల వికృత చేష్టలకు అక్కడి గుంతలే సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
పెన్నాను ఊడ్చేస్తున్నారు..
ఉరవకొండ నియోజకవర్గం బెళుగుప్ప మండలం కాలువపల్లి మీదుగా వెళ్తున్న పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని ఇసుకను స్థానిక టీడీపీ నేతలు ఊడ్చేశారు. పెన్నానదిలో ఎటు చూసినా గుంతలే దర్శనమిస్తున్నాయి. మంత్రి అండదండలు ఉండడంతో అధికారులు ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో ఎలాంటి ఇసుక రీచ్‌ల (ఓపెన్, పట్టా)కు గనుల శాఖ అధికారులు అనుమతులు ఇవ్వలేదు. అయినా ఇసుక రవాణా మాత్రం సాగుతోంది. బెళుగుప్ప, కూడేరు మండలాలకు చెందిన టీడీపీ నేతలు రోజువారీగా పదుల ట్రాక్టర్లలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు బెళుగుప్పకు కాలువపల్లి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇసుక అక్రమ రవాణాను రోజూ చూస్తున్నా మంత్రికి భయపడి చర్యలకు వెనకడుగు వేస్తున్నారు.
జిల్లాలో 6 రీచ్‌లకు మాత్రమే అనుమతి..
జిల్లా వ్యాప్తంగా గనుల శాఖ అధికారులు కేవలం ఆరు ఇసుక రీచ్‌లకు అనుమతి ఇచ్చారు. వాటిలో కణేకల్లు మండలం రచ్చుమర్రి గ్రామంలో ఓపెన్ రీచ్, శింగనమల మండలం తరిమెల గ్రామంలో పట్టా భూముల్లో రెండు, యల్లనూరు మండలంలో ఒకటి, పెద్దవడుగూరు మండలంలో రెండు పట్టా భూముల్లో రీచ్‌కు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే తాడిపత్రి మండలంలోని పెన్నా పరివాహక ప్రాంతంలో, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని తిమ్మసముద్రం, కంబదూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో పెద్ద ఎత్తున ఇసుక దందాను స్థానిక ప్రజాప్రతినిధుల అండతో టీడీపీ నాయకులు సాగిస్తున్నారు.