
దంపతులపై దాడి కేసులో వడ్డీ వ్యాపారి అరెస్ట్
ధర్మవరం అర్బన్: వడ్డీ వ్యాపారం చేస్తూ దాడులు, బెదిరింపులకు దిగిన ప్రధాన నిందితుడు సాకే రాజశేఖర్ అలియాస్ యర్రగుంట రాజాను అరెస్టు చేసినట్లు ధర్మవరం డీఎస్పీ హేమంత్‌కుమార్ తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం వివరాలను డీఎస్పీ వెల్లడించారు. లక్ష్మీచెన్నకేశవపురానికి చెందిన సాకే రాజశేఖర్ ధర్మవరం పరిసర ప్రాంతాల్లో అక్రమ వడ్డీ వ్యాపారం చేస్తూ అనుచరులతో కలిసి బెదిరించడం, దాడులు చేయించడం, బలవంతంగా డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారన్నారు. జూలై 23న శాంతినగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రమణ, అతని భార్య భారతిపై ఎర్రగుంట రాజా తన అనుచరులతో దాడి చేసి రూ.7 వేల నగదు తీసుకెళ్లారన్నారు. బాధితురాలు భారతి ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసు నమోదు చేసి దరాప్తు చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. పరారీలో ఉన్న రాజాను పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో అరెస్టు చేశామని తెలిపారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్‌తో పాటు రూ.కోటి విలువ చేసే భూసంబంధిత రిజిస్ట్రేషన్ పత్రం, రూ.10 లక్షలు విలువ చేసే రెండు ప్రామిసరీ నోట్లు, రూ.2700 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. రాజశేఖర్‌పై ఇప్పటికే పలు మర్డర్ కేసులు, వడ్డీ వ్యాపార దాడుల కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.