
ఉత్తమ టీచరు అవార్డులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 5న జరిగే ‘గురుపూజోత్సవం’ రోజున జిల్లాస్థాయిలో అందజేసే ‘ఉత్తమ టీచరు’ అవార్డులకు అర్హులైన టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్‌బాబు కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, ఏపీఎంఎస్, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఏపీఆర్‌ఈఐఎస్, కేజీబీవీ స్కూళ్లు, డైట్ కళాశాలలో పని చేస్తున్న టీచర్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని వెల్లడించారు. దరఖాస్తులు (రెండుసెట్లు) ఈనెల 25 సాయంత్రం 5 గంటలలోపు ఎంఈఓ/డీవైఈఓకు అందజేయాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రిమార్కులతో 28 సాయంత్రం 5 గంటలలోపు ఎంఈఓ/డీవైఈఓలు డీఈఓ కార్యాలయంలో అందజేయాలని ఆదేశించారు.
దరఖాస్తుకు నిబంధనలివీ..
కనీసం పదేళ్లు బోధనానుభవం ఉండాలి. గతంలో జిల్లాస్థాయి అవార్డు తీసుకుని ఉండకూడదు. దరఖాస్తుదారునిపై ఎలాంటి క్రిమినల్ కేసులు/ఆర్టికల్ ఆఫ్ ఛార్జెస్/శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు ఉండకూడదు. మరిన్ని వివరాలకు డీఈఓ బ్లాగ్‌స్పాట్‌లో పరిశీలించాలని డీఈఓ తెలిపారు.
సేవాఘడ్ గురుకులంలో
ప్రవేశానికి దరఖాస్తులు
అనంతపురం రూరల్: గొల్లలదొడ్డి (సేవాఘడ్) గిరిజన గురుకుల పాఠశాలలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5,6, 7, 8 తరగతులతో పాటు ఇంటర్‌లో ఖాళీగా ఉన్న సీట్లకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ విజయ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్టీ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులకు వసతితో పాటు ప్లేట్లు, గ్లాసులు, నోట్ పుస్తకాలు, దుస్తులు అందిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 98853 69079, 8978239363, 9550655840 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు.
దివ్యాంగులతో చెడుగుడు
అనంతపురం క్రైం: కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై ప్రతాపం చూపుతోంది. పూటకో నిబంధనలు మారుస్తూ వారితో చెడుగుడు ఆటుకుం టోంది. లేని పోని నిబంధనలను పెట్టి కార్యాలయాలు, ప్రభుత్వ వైద్యుల చుట్టూ తిప్పుతోంది. దివ్యాంగుల పింఛన్ల పంపిణీలో కొన్ని మార్పులు చేసినట్లు గురువారం ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 40% కంటే తక్కువ వైకల్యం ఉండి, 60 సంవత్సరాలు మించిన వారిని వృద్ధుల కేటగిరీలోకి మార్చి రూ.4 వేల పింఛనులోకి చేర్చేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. మానసిక వైకల్యం కలిగి ఉన్న 18 సంవత్సరాల వయసు లోపు పిల్లలకు యథావిధిగా పింఛను అందించనున్నట్లు స్పష్టం చేసింది. ఇకపోతే... పునఃపరిశీలనలో కొంతమంది దివ్యాంగులకు తాత్కాలిక సర్టిఫికెట్లు జారీ చేసి రద్దు నోటీసులు ఇచ్చారని, ఇలాంటి వారు ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్ల వద్ద అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపింది. అప్పీల్ నోటీసుతో పాటు అప్పీల్ లెటర్, ఆధార్ కలిపి ఎంపీడీఓ లేదా మున్సిపల్ కమిషనర్‌కి అందించాలని సూచించింది. నోటీసు అందిన 30 రోజుల్లోపు అప్పీల్ చేసుకొనే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.