
మూడో రోజూ కానరాని ‘మార్పు’
● మహిళా ప్రజాప్రతినిధులకు ముగిసిన శిక్షణ
● చివరి రోజు ముగ్గురే హాజరు
అనంతపురం సిటీ: అనంతపురంలోని జిల్లా పరిషత్ క్యాంపస్‌లో గల డీపీఆర్‌సీ భవన్‌లో మహిళా ప్రజా ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులు మొక్కుబడిగా ముగిశాయి. ‘మార్పు ద్వారా విజేతలు–మహిళా సాధికారతతో స్వపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఉమ్మడి జిల్లాలోని మహిళా జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. మంగళవారం నుంచి మొదలైన శిక్షణ తరగతులకు కనీస స్పందన లేదంటే అతిశయోక్తి కాదు. తొలి రోజు ఇద్దరు, రెండో రోజు ముగ్గురు హాజరు కాగా, చివరి రోజు కూడా కేవలం ముగ్గురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. వారిలో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులు కాగా, మరొకరు ఎంపీపీ ఉన్నారు. అయితే వారికి ఎటువంటి శిక్షణ ఇవ్వలేకపోయారు. ఘనత వహించిన అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఈ మాత్రానికి శిక్షణ తరగతులు ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం కావడం లేదని వచ్చిన ప్రజాప్రతినిధులు వాపోయారు. మరో ఏడాదిలో పదవీ కాలం ముగుస్తున్న తరుణంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై మహిళా ప్రజాప్రతినిధులు పెదవి విరుస్తున్నారు. ఎలాంటి ఉపయోగం లేకపోగా, నిధుల దుర్వినియోగం బాగా జరుగుతోందని వాపోయారు.