
డిమాండ్‌కు సరిపడని యూరియా
పుట్టపర్తి అర్బన్: ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియా రైతుల డిమాండ్‌కు సరిపోవడం లేదు. ఒక లోడు, అర లోడు చొప్పున పంపుతుంటే కేవలం గంటల వ్యవధిలోనే ఖాళీ అవుతోంది. జిల్లాలో ఈ ఏడాది అత్యధికంగా మొక్కజొన్న, వరి సాగు చేపట్టారు. అయితే యూరియా డిమాండ్ ఉన్న ఈ పంటల్లో ప్రభుత్వం అరకొరగా సరఫరా చేస్తుండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. యూరియా కోసం రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు క్యూ కడుతున్నారు. గురువారం పెడపల్లి సొసైటీకి 140 బస్తాల యూరియా రాగా, రెండు గంటల వ్యవధిలోనే ఖాళీ అయిపోయింది. ఒక్కో రైతుకు రెండేసి బస్తాలు చొప్పున పంపిణీ చేసినా క్యూ లైన్‌లో వేచి ఉన్నవారిలో సగం మందికి కూడా దక్కలేదు. దీంతో చాలా మంది రైతులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ప్రస్తుతం జిల్లాలో 4,700 టన్నుల యూరియా ఉన్నట్లుగా వ్యవసాయ శాఖ చెబుతున్నా.. ఈ మొత్తం ఏనాడో ఖాళీ అయిపోయి ఉంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ వచ్చే లోడు కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేయాల్సి వస్తోందన్నారు.
వచ్చిన వెంటనే ఖాళీ అవుతున్న గోదాములు