గంజాయి మత్తు .. బతుకు చిత్తు! | - | Sakshi
Sakshi News home page

గంజాయి మత్తు .. బతుకు చిత్తు!

Aug 22 2025 3:25 AM | Updated on Aug 22 2025 3:25 AM

గంజాయి మత్తు .. బతుకు చిత్తు!

గంజాయి మత్తు .. బతుకు చిత్తు!

కదిరి: జిల్లాలో ఏడాదిగా గంజాయి దందా గుట్టు చప్పుడు కాకుండా సాగుతోంది. యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి ముఠా సభ్యులు విక్రయాలు సాగిస్తున్నారు. పోలీసులకు దొరక్కుండా పట్టణాలు మొదలు గ్రామాల్లో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గంజాయి ముఠా సభ్యులకు కొండంత రాజకీయ అండ దొరికింది. దీంతో వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది.

గుట్టు చప్పుడు కాకుండా..

కోస్తాలోని పలు ప్రాంతాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా జిల్లాకు గంజాయి గుట్టుగా తరలి వస్తోంది. ఇందుకోసం గంజాయి ముఠా సభ్యులు కొందరు నిరుపేదలను ఎంపిక చేసుకొని వారికి కమీషన్‌ రూపంలో చెల్లిస్తున్నారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. ప్రయాణికుల్లాగా వీరు బస్సులు, రైళ్లలో సరుకు తీసుకొచ్చి గంజాయి ముఠాకు అప్పగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో గంజాయిని తీసుకొస్తున్న వారు దొరికినా సరఫరాదారులు, విక్రయదారులు మాత్రం అధికార పార్టీ నేతల అండతో తప్పించుకుంటున్నారు. గంజాయిని అరికట్టడం తమకు పెద్ద సమస్య కాదని, అసాంఘిక శక్తులకు అధికార పార్టీ నేతలు సహకరించకపోతే సంతోషిస్తామని జిల్లాకు చెందిన ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ఇటీవల తలుపుల మండలంలో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఒక దొంగను వదిలేయమని ఒక ప్రజాప్రతినిధి ఫోన్‌ చేసి చెప్పిన విషయాన్ని మరో పోలీస్‌ అధికారి గుర్తు చేశారు.

ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే ..

హిందూపురం, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, మడకశిర, పెనుకొండ ప్రాంతాల్లోని పలు విద్యాసంస్థల వద్ద విద్యార్థులకు గంజాయి అమ్ముతున్నారు. మత్తుకు అలవాటు పడ్డ కొందరు విద్యార్థులు గంజాయి కొనుక్కోవడానికి ఇంట్లో డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో వారిపై దాడులకు కూడా పాల్పడిన సంఘటనలు ఉన్నాయని కదిరికి చెందిన ఓ విద్యార్థి తెలిపారు. కొన్ని చోట్ల యువకులు బృందాలుగా ఏర్పడి డబ్బులకోసం ఎంతకై నా తెగిస్తున్నారు.

కదిరి మండలం కాళసముద్రంలో ఇటీవల కొందరు మైనర్లు తోటి పిల్లలపై గంజాయి మత్తులో చెప్పులు, కర్రలతో దాడి చేసి ఆ దృశ్యాలను వారే సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఈ సంఘటనపై ఎస్పీ వి.రత్న ఆ గ్రామాన్ని సందర్శిస్తే పోలీసుల మెతక వైఖరి కారణంగానే ఇలా జరుగుతోందంటూ ఆమైపె బాధిత కుటుంబ సభ్యులతో పాటు మరికొందరు ఆగ్రహించిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది జనవరిలో ఎన్‌పీ కుంట మండలంలో గంజాయి అమ్ముతున్న తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి వారి నుండి 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి మీడియాకు వెల్లడించిన విషయం తెలిసిందే.

తాజాగా కదిరి రూరల్‌ పోలీసులు కొండమనాయునిపాళ్యం వద్ద వాహనంలో గంజాయి తరలిస్తున్న గంజాయి ముఠాను అదుపులోకి తీసుకొని వారి నుండి సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

యువతే లక్ష్యంగా జిల్లాలో జోరుగా విక్రయాలు

అధికార అండతో రెచ్చిపోతున్న

గంజాయి ముఠా

ప్రయాణికుల ముసుగులో

సరుకు తరలింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement