
చిన్నారికి ప్రాణభిక్ష పెట్టండి
నల్లచెరువు: మండలంలోని దేవిరెడ్డిపల్లికి చెందిన ఇమాంబాషా, షబానా దంపతుల నాలుగేళ్ల వయసున్న ఏకై క కుమార్తె అల్ఫియా ప్రాణాపాయ స్థితిలో బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఇప్పటికే రూ. లక్షలు ఖర్చు కాగా, పాప సంపూర్ణ ఆరోగ్య వంతురాలు కావడానికి అవసరమైన చికిత్స కోసం రూ.10 లక్షలు అవుతుందని అక్కడి డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో నిరుపేద కుటుంబానికి దిక్కుతోచడం లేదు. ఆపన్న హస్తం అందించి తమ కుమార్తెకు ప్రాణభిక్ష పెట్టాలని వేడుకుంటున్నారు.
20 రోజుల క్రితం న్యూమెనియా..
అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గ్యాస్ ఏజెన్సీలో డెలవరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని ఇమాంబాషా పోషించుకుంటున్నాడు. జీవనం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 20 రోజుల క్రితం అల్ఫియాకు జబ్బు చేసింది. తీవ్రమైన జ్వరం, దగ్గు ఎక్కువగా ఉండడంతో మదనపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. పది రోజులు గడిచాయి. అయినా చిన్నారికి నయం కాకపోవడంతో మరోసారి వైద్య పరీక్షించి న్యూమోనియాతో బాధపడుతున్నట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తెలిసిన వారి వద్ద అప్పు చేసి డబ్బు సమకూర్చుకుని ఆగమేఘాలపై బెంగళూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి చిన్నారిని తీసుకెళ్లారు.
సక్రమంగా పనిచేయని కిడ్నీలు
అల్ఫియాకు వైద్య పరీక్షలు నిర్వహించిన బెంగళూరులోని ఆస్పత్రి వైద్యులు.. న్యూమోనియాతో పాటు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించారు. ఈ క్రమంలోనే రెండు కిడ్నీలూ సక్రమంగా పనిచేయడం లేదని నిర్ధారించారు. అల్ఫియా పరిస్థితి విషమంగా ఉండడంతో సత్వర చికిత్సలు అందించాలని పాప పూర్తిగా కోలుకోవాలంటే రూ.10 లక్షల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. పిడుగు లాంటి వార్త విన్న నిరుపేద తల్లిదండ్రులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో చిన్నారి వైద్య ఖర్చులు మొత్తం భరించాల్సి వస్తోంది. ఇప్పటికే తెలిసిన వారి వద్ద చేసిన రూ. 4 లక్షల వరకూ అప్పు చేసి చికిత్స చేయించారు. అయినా పాప పరిస్థితిలో మార్పు లేకపోవడంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. అక్కడి ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారికి ప్రాణభిక్ష పెట్టే దాతలు ఎవరైనా ముందుకు రావాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
సాయం చేయదలిస్తే.. పేరు : ఎస్.షబానా బ్యాంకు పేరు : ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు (ఏపీజీబీ) ఖాతా నంబర్ : 9115 0793 384 ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ : ఏపీజీబీ0001047 ఫోన్‌పే నంబర్ : 93915 74457
సక్రమంగా పని చేయని రెండు కిడ్నీలు
బ్లడ్ ఇన్‌ఫెక్షన్, న్యూమోనియాతో కదలలేని స్థితి
చికిత్స కోసం రూ.10 లక్షలు అవసరం
దాతల కోసం ఎదురు చూస్తున్న నిరుపేద కుటుంబం