
ఫీజు చెల్లించకున్నా.. చెల్లించినట్లు
●బహిర్గతమైన ఎస్కేయూ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్వ విద్యార్థుల పన్నాగం ●విచారణకు ప్రత్యేక కమిటీ
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ ఫార్మసీ కళాశాలలో బీఫార్మసీ పూర్తి చేసిన ఇద్దరు విద్యార్థులు ఏకంగా బ్యాంకు చలానాలు ఫోర్జరీ ఫీజు చెల్లించినట్లుగా చూపి సర్టిఫికెట్లు పొందారు. కేవలం నాలుగు వేలు ఫీజు చెల్లించి.. రూ.14 వేలు ఫీజు చెల్లించినట్లుగా చలానాలను ఫోర్జరీ చేసిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇంకా ఎంత మంది విద్యార్థులు ఉన్నారనే అంశంపై వివరాలు నిగ్గు తేల్చడానికి ప్రొఫెసర్ల కమిటీని నియామకం చేశారు. చలానాల్లో మూడు విభాగాలుగా విభజించి ఇస్తారు. ఒకటి బ్యాంకు.. రెండోది విద్యార్థికి.. మూడోది పరీక్షల విభాగానికి పంపుతారు. విద్యార్థికి ఇచ్చిన చలానా భాగంలో ఫోర్ థౌజండ్ అనే పదాల స్థానంలో ఫోర్టీన్ అని రాసి.. 4,000 అని అంకెల రూపంలో ఉన్న స్థానానికి ముందు 1 చేర్చి 14,000గా మార్చి చలనాను కళాశాలలో సమర్పించారు. దీంతో ఫీజు మొత్తం చెల్లించినట్లుగా నిర్ధారించుకుని సర్టిఫికెట్లు అందజేశారు. ఫోర్జరీ చేసిన విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నారు.