
రేషన్ బియ్యం డంప్ స్వాధీనం
గుంతకల్లు రూరల్: పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో ఉన్న బయలు ప్రదేశంలో డంప్ చేసిన 49.6 క్వింటాళ్ల (105 బస్తాల) రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి 11 గంటల సమయంలో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారం రోజుల క్రితం ఇదే స్థలంలో 78.5 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న ఘటన మరువకనే మళ్లీ అక్కడే 105 బస్తాల బియ్యం డంప్‌ను అధికారులు గుర్తించడం గమనార్హం. కార్యక్రమంలో సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మి, వీఆర్వో మల్లికార్జున, పోలీసులు పాల్గొన్నారు.
స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
● వచ్చే నెల 5న ఎన్నికలు
అనంతపురం కార్పొరేషన్: నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ను కమిషనర్ బాలస్వామి విడుదల చేశారు. ఈ నెల 22 నుంచి ఈ నెల 28వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరిస్తారు. 29న నామినేషన్ల పరిశీలన, అదే రేజు 3 గంటలకు ప్రచురణ ఉంటుంది. వచ్చే నెల 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజున సాయంత్రం 3 గంటలకు పోటీ అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. వచ్చే నెల 5న నగరపాలక సంస్థలోని నూతన భవనంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికల పోలింగ్, అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు వెల్లడిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.
పట్నం పూర్వపు ఎస్‌ఐ రాజశేఖర్‌పై కేసు నమోదు
గుత్తి: న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన గిరిజన మహిళను లైంగికంగా వేధించడంతో పాటు రాత్రి వేళల్లో నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడి ఉద్యోగం పోగొట్టుకున్న ముదిగుబ్బ మండలం ‘పట్నం’ పూర్వపు ఎస్‌ఐ రాజశేఖర్‌పై గుత్తి పోలీసులు కేసు నమోదు చేశారు. గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన ఓ మహిళ ఎస్‌ఐ రాజశేఖర్‌పై ఫిర్యాదు చేయగా.. సీఐ వెంకటేశ్వర్లు సమగ్రంగా విచారించి రాజశేఖర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, లైగింక వేధింపులతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. కాగా, సమస్య పరిష్కారం కోసం పట్నం పోలీసు స్టేషన్‌కు వచ్చిన గిరిజన మహిళను ఎస్‌ఐ హోదాలో ఉన్న రాజశేఖర్ లైంగికంగా వేధించిన వైనంపై ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన ఎస్పీ రత్న తొలుత రాజశేఖర్‌ను వీఆర్‌కు పంపారు. అనంతరం విచారణ జరిపారు. రాజశేఖర్ లైంగిక వేధింపులు నిజమని తేలడంతో అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ రాయలసీమ రేంజ్ డీఐజీ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా లైంగిక వేధింపులపైనే గుత్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.