
నేత్రపర్వంగా శ్రీవారి ఉంజల్ సేవ
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీవారి ఉంజల్ సేవ గురువారం రాత్రి నేత్ర పర్వంగా నిర్వహించారు. శ్రావణ మాసం బహుళ పక్షం త్రయోదశి పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో గురువారం రాత్రి భూదేవి, శ్రీదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను ప్రత్యేక అలంకరించి శ్రీరంగ మంటపంలో డోలోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మహిళ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
భార్యకు అవమానం..
భర్త ఆత్మహత్య
వజ్రకరూరు: తన భార్యకు జరిగిన అవమానాన్ని తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. వజ్రకరూరు మండలం తట్రకల్లు గ్రామానికి చెందిన బాలతిమ్మరాజు (40)కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుధవారం సాయంత్రం కాయగూరలను ఫ్రిజ్‌లో పెట్టేందుకు భార్య పక్కింటికి వెళ్లింది. ఆ సమయంలో పక్కింటి యజమాని కురుబ నాగార్జున ఆమెను బలత్కారం చేయబోయాడు. ప్రతిఘటించి ఇంటికి చేరుకున్న భార్య జరిగిన విషయాన్ని భర్తకు తెలపడంతో బాలతిమ్మరాజు నేరుగా వెళ్లి నిలదీశాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగి విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. దీంతో గ్రామంలో పరువు పోయిందనే మనోవేదనతో తిమ్మరాజు బుధవారం రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక గురువారం బాల తిమ్మరాజు మృతి చెందాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కురుబ నాగార్జునతో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.