
నానో యూరియాతో మంచి ఫలితాలు
● రైతులకు ఖర్చు కూడా తగ్గుతుంది
● ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి
అనంతపురం అగ్రికల్చర్: నానో యూరియాతో మంచి ఫలితాలు సాధించవచ్చని ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి అన్నారు. ‘నానో’ యూరియా, డీఏపీ ఎరువుల వాడకంపై హార్టికల్చర్ ఆఫీసర్లు (హెచ్‌ఓలు), విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు (వీహెచ్‌ఏ)కు అవగాహన కల్పించారు. స్థానిక ప్రాంతీయ ఉద్యాన శిక్షణా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏడీ దేవానంద్ పాల్గొని నానో ఎరువుల వాడకం, ప్రయోజనాల గురించి తెలియజేశారు. మామూలు యూరియా, డీఏపీతో పోల్చితే ద్రవ రూపంలో ఉన్న నానో యూరియా, డీఏపీ వాడకం వల్ల పంటల్లో మంచి ఫలితాలు వచ్చినట్లు పరిశోధనలు రుజువు చేశాయన్నారు. రైతులకు ఖర్చు కూడా వాటి కన్నా కాస్త తక్కువగానే ఉంటుందని తెలిపారు. మామూలు యూరియాను దిగుమతి చేసుకోవడం వల్ల ప్రభుత్వాలపై భారం పడుతోందన్నారు. ఈ క్రమంలో దేశంలోనే ఉత్పత్తి చేస్తున్న నానో యూరియా, డీఏపీ వల్ల అటు ప్రభుత్వాలకు ఇటు రైతులకు కూడా ఖర్చు తగ్గి మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు. వివిధ పంటల్లో ఎంత మోతాదులో వాడాలి, ఎలా వాడాలనే దానిపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కోరమాండల్ ప్రతినిధులు గోవిందరావు, మహబూబ్‌అలీ, వెంకటేశు, శివకుమార్, హెచ్‌ఓ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.