
గిరిజనుడిపై టీడీపీ సానుభూతిపరుడి దాడి
ఉరవకొండ: మండలంలోని లత్తవరం తండాకు చెందిన వైఎస్సార్‌సీపీ గిరిజన విభాగం అధ్యక్షుడు ప్రసాద్‌నాయక్‌పై అదే గ్రామానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు తులసీనాయక్ దాడి చేశాడు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు.. బుధవారం ఉదయం తన పొలానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా ట్రాక్టర్‌పై వస్తున్న తులసీనాయక్ దారి ఇవ్వకుండా అడ్డంగా నిలిపి వేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో తులసీనాయక్ రాయితో దాడి చేయడంతో తలకు బలమైన గాయమైంది. క్షతగాత్రుడిని కుటుంబసభ్యులు వెంటనే ఉరవకొండలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, విషయం తెలుసుకున్న ఉరవకొండ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి.. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని కోరారు.