
యూరియా ‘నో స్టాక్’
● కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
అనంతపురం అగ్రికల్చర్: యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు కూటమి ప్రభుత్వానికి కనిపించడం లేదు. పది రోజులుగా జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రస్థాయిలో వేధిస్తోంది. విస్తారంగా వర్షాలు పడటంతో వేరుశనగ, కంది, ఆముదం, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు యూరియా వేసుకోవాల్సి ఉండటంతో దాని కోసం పడిగాపులు కాస్తున్నారు. డిమాండ్ తగ్గట్టు సరఫరా లేకపోవడంతో చాలా ప్రాంతాల్లో యూరియా లభించడం లేదు. ముందస్తు చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్ విఫలం కావడంతో రైతుకు అవస్థలు అధికమయ్యాయి. యూరియా కోసం జిల్లాకేంద్రంలోని డీసీఎంఎస్‌కు మంగళవారం కూడా రైతులు ఎగబడ్డారు. పరిసర మండలాల నుంచి ఉదయం 8 గంటలకే పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ యూరియా సరఫరా కాలేదని ‘నోస్టాక్’ బోర్డు పెట్టడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సీపీఎం అనుబంధ ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి, పండ్లతోటల రైతుల సంఘం జిల్లా కార్యదర్శి వి.శివారెడ్డి తదితరులు డీసీఎంఎస్ వద్దకు చేరుకుని రైతులకు మద్ధతుగా డీసీఎంఎస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. డీసీఎంఎస్ ఎదుట ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూరల్ ఏఓ వెంకటకుమార్ చేరుకుని రైతులు, రైతు సంఘం నాయకులతో మాట్లాడారు. సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ దుకాణంలో ఉన్న 60 బస్తాలు యూరియా రెండు బస్తాలు చొప్పున రైతులకు పంపిణీ చేయించారు. యూరియా సమస్య వేధిస్తుండటంతో తమ పరిస్థితి దారుణంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

యూరియా ‘నో స్టాక్’