
డీడీఓగా నాగశివలీల
అనంతపురం సిటీ: అనంతపురం డివిజనల్ డెవలప్‌మెంట్ అధికారి (డీడీఓ)గా నాగశివలీల మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా నుంచి బదిలీపై వచ్చిన ఆమె 2007లో ఎంపీడీఓగా ఎంపికై కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో పని చేశారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కేంద్రంగా సెర్ప్‌లో పని చేశారు. అక్కడి నుంచి మెప్మా, డీఆర్‌డీఏ పీడీగా కర్నూలు జిల్లాలో పని చేశారు. ఇప్పుడు బదిలీలపై అనంతపురం రెగ్యులర్ డీడీఓగా వచ్చారు.
స్కాలర్‌షిప్ కోసం
దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం సిటీ: తపాలా శాఖ ఆధ్వర్యంలో అందించే దీన దయాళ్ స్పర్శ యోజన స్కాలర్‌షిప్ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తపాలా శాఖ సూపరింటెండెంట్ బి.లక్ష్మన్న మంగళవారం తెలిపారు. తపాలా సేవలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించే ఉద్దేశంతో ఆరు నుంచి తొమ్మిదో తరగతి చదివే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేస్తున్నట్లు వివరించారు. గడిచిన విద్యా సంవత్సరంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత కలిగి ఉండాలన్నారు. స్కాలర్‌షిప్ ఎంపిక కోసం రెండు రకాల పరీక్షల్లో ప్రతిభ చూపిన వారికి రూ.6 వేలు చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు వ్యక్తిగతంగా గానీ, స్కూల్ ప్రధానోపాధ్యాయుడి ద్వారా గానీ రూ.200తో అనంతపురం, గుంతకల్లులోని ప్రధాన తపాలా కార్యాలయాల్లో ఖాతాలు తెరచి, దరఖాస్తుకు జత చేసి సూపరింటెండెంట్, పోస్ట్, అనంతపురం– 515001 చిరునామాకు స్పీడ్‌పోస్ట్ ద్వారా మాత్రమే పంపాలని సూచించారు.
సెలవులో జెడ్పీ సీఈఓ
అనంతపురం సిటీ: జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి(సీఈఓ) శివశంకర్ సెలవులో వెళ్లారు. 10 రోజుల సెలవు కావాలని ఆయన లెటర్ పెట్టగా.. వారం రోజులకు మాత్రమే కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. ఆ తరువాత ఆయన సెలవు పొడిగించుకునే అవకాశం ఉంటుందని జెడ్పీ వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా, గత సీఈఓ రామచంద్రారెడ్డి పట్టుమని మూడు నెలలు తిరక్కనే ఆయనను టీడీపీ ఎమ్మెల్యేలు టార్గెట్ చేసి బలవంతంగా సాగనంపిన సంగతి దుమారం రేపింది. తరువాత శ్రీసత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో డ్వామా ఏపీడీగా పని చేస్తున్న శివశంకర్‌ను జెడ్పీ సీఈఓగా బదిలీ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయన రాకను ఓ ద్వితీయ శ్రేణి అధికారి జీర్ణించుకోలేక లోలోన పొగబెడుతుండడంతో చివరకు సెలవులో వెళ్లాల్సి వచ్చిందని జెడ్పీ ఉద్యోగులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ వస్తారో.. లేదో అనే విషయంపై చర్చ నడుస్తోంది.