
జీజీహెచ్ వైద్యం.. దైవాధీనం
అనంతపురం మెడికల్: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో వైద్య సేవలు అడుగంటుతున్నాయి. అత్యవసర ప్రాంతాల్లో వైద్యులను నియమించకుండా అనవసర ప్రాంతాలకు కేటాయించడంతో రోగులు నరక యాతన అనుభవిస్తున్నారు. దీనికి తోడు మౌలిక వసతులు లోపించడంతో రోగులకందే సేవల్లో నాణ్యత లోపిస్తోంది.
ఒక్క రోగికి నలుగురు సీఎంఓలు
ఈ నెల 11 నుంచి తలకు సంబంధించిన కేసులు నేరుగా అనంతపురంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి వెళ్లవచ్చునని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ప్రకటించారు. ఈ క్యాజువాలిటీకి ఏకంగా నలుగురు సీఎంఓలను ఏర్పాటు చేశారు. సరాసరి రోజుకు ఒకరిద్దరుకు మించి రోగులు ఉండడం లేదు. ఈ లెక్కన ఒక రోగికి నలుగురు సీఎంలు చికిత్స చేయాల్సి వస్తోంది. వాస్తవానికి సూపర్ స్పెషాలిటీలో క్యాజువాలిటీ ఏర్పాటుకు సౌకర్యాలు లేకపోయినా క్యాంటీన్‌కు కేటాయించిన గదిలోనే ఏర్పాటు చేశారు. అందులో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్, పల్స్ ఆక్సీమీటర్లు, వెంటిలేటర్లు, విద్యుత్ సరఫరా బోర్డులు, తదితర వాటిని ఏమీ లేవు. డీఎంఈ ఆదేశించారంటూ సూపరింటెండెంట్ డాక్టర్ ఆత్మారాం ముందుచూపు లేకుండా సూపర్‌లో క్యాజువాలిటీ ఏర్పాటు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది.
జీజీహెచ్ క్యాజువాలిటీలో
ఆరుగురు సీఎంఓలు
సర్వజనాస్పత్రిలో క్యాజువాలిటీకి రోజూ మూడు షిప్టుల్లో 800 నుంచి వెయ్యి మంది వరకు రోగులు వస్తుంటారు. ఇలాంటి తరుణంలో పదుల సంఖ్యలో సీఎంఓల అవసరం ఉంటుంది. అయితే ఇటీవల క్యాజువాలిటీలో విధులు నిర్వర్తించే ఓ సీఎంఓను నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు నియమించారు. ప్రస్తుతం ఆరుగురు సీఎంఓలతోనే సర్వజనాస్పత్రిలోని క్యాజువాలిటీ నడుస్తోంది. గతంలోనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలోకి నలుగురు సీఎంఓలు వివిధ స్పెషాలిటీ సేవల్లో ఓపీలకు వినియోగిస్తున్నారు.
రోగుల ప్రాణాలతో చెలగాటం
అనవసర ప్రాంతాల్లో వైద్యుల ఏర్పాటు
సూపర్ స్పెషాలిటీ క్యాజువాలిటీలో ఒక్క రోగికి నలుగురు సీఎంఓలు
జీజీహెచ్ ఎమర్జెన్సీలో 800 నుంచి వెయ్యి వరకూ ఓపీ
సీఎంఓల కొరతతో
జీజీహెచ్‌లో రోగులపై ప్రభావం
నిబంధనలకు విరుద్ధంగా ‘సూపర్’ క్యాంటీన్‌లో క్యాజువాలిటీ ఏర్పాటు

జీజీహెచ్ వైద్యం.. దైవాధీనం