
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతం చేద్దాం
● గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్
రాప్తాడు: పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని, ఆధునిక వ్యవసాయ పధ్దతులకు స్వస్తి చెప్పి ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా రైతులను ప్రోత్సహించాలని సంబంధిత అధికారులను గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ ఆదేశించారు. రాప్తాడు మండలం జి.కొత్తపల్లిలో ప్రకృతి వ్యవసాయ విధానంతో మహిళా రైతులు అనిత 4 ఎకరాల్లో సాగు చేసిన డ్రాగన్ ప్రూట్ పంట, లోకేశ్వరి సాగు చేసిన సీతా ఫలం, టమాట, అలసంద పంటలు, లక్ష్మీదేవి సాగు చేస్తున్న ఏటీఎం మోడల్‌ను సోమవారం ఆయన పరిశీలించారు. ఆనంతరం ఆయన గ్రామంలో రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులతో ముఖాముఖీ కార్యక్రమంలో మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేసిన పంటలకు పెట్టుబడి తక్కువగా ఉంటుందని, దిగుబడులు పెరుగుతున్నాయని రైతులు తెలిపారు. ఈ పంటలకు మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు అందించాలని కోరారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకున్న అభివృద్ది చెందిన దేశాలే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను, నాణ్యమైన దిగుబడులను సాధించాలంటే ప్రకృతి వ్యవసాయమే ఉత్తమమైనదన్నారు. ప్రతి రైతూ ఆర్థికంగా బలపడాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం ఒక్కటే మార్గమన్నారు. ఏటీఎం మోడల్‌తో రోజు వారీ ఆదాయాన్ని పొందవచ్చన్నారు. 18 సెంట్లలో 22 రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేసిన లక్ష్మీదేవిని అభినందించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంటలను స్టాల్స్‌గా ఏర్పాటు చేయడంతో వాటిని పరిశీలించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సచిన్ రహేర్, సెర్ఫ్ సీఈఓ శ్రీరాములు నాయుడు, డీపీఎం లక్ష్మానాయక్, ఉన్నతి డైరెక్టర్ శివశంకర్, స్త్రినిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ శైలజ, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏపీఎం సునీత, రైతులు పాల్గొన్నారు.
సంఘాలతో మహిళల ఆర్థికాభివృద్ధి
బుక్కరాయసముద్రం: గ్రామీణ ప్రాంతాలలో సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ది సాధించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి టి.కె.అనిల్‌కుమార్ అన్నారు. బీకేఎస్‌లోని వెలుగు కార్యాలయంలో సోమవారం ఆయన మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై మాట్లాడారు. సంఘాల ద్వారా ఆర్థిక ప్రగతి సాధించిన మహిళలను అభినందించారు. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహేర్, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు.