
పీఏబీఆర్‌లో పెరుగుతున్న నీటి మట్టం
కూడేరు: మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్)లో నీటి మట్టం పెరుగుతోంది. ఇన్‌ఫ్లో పెరగడంతో 18 రోజులకే 2.17 టీఎంసీల నీరు చేరుకుంది. సోమవారం నాటికి రిజర్వాయర్‌లో 4.024 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణ తెలిపారు. సత్యసాయి, శ్రీరామరెడ్డి, అనంతపురం, ఉరవకొండ, కూడేరు తాగునీటి ప్రాజెక్టులకు, నీటి ఆవిరి, లీకేజీల రూపంలో రోజుకు దాదాపు 130 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందని వివరించారు.
మద్యం మత్తులో
భార్య గొంతు కోసిన భర్త
అనంతపురం: మద్యంలో మత్తులో కట్టుకున్న ఇల్లాలి గొంతును భర్త కోశాడు. అనంతపురం రెండో పట్టణ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా ఓబులంపల్లి తండాకు చెందిన రవి నాయక్, భాగ్యబాయి దంపతులు ధర్మవరంలో కూలి పనులతో జీవనం సాగించేవారు. రవి నాయక్ తాగుడుకు బానిస కావడంతో భాగ్యబాయి 20 రోజుల క్రితం అనంతపురం లోని ఓబులదేవరనగర్‌లో మకాం మారి అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. ఆమెతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. రెండు రోజుల క్రితం భాగ్యబాయి వద్దకు వచ్చిన రవినాయక్.. సోమవారం మద్యం సేవించి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో కత్తి తీసుకుని భాగ్య బాయి గొంతు కోసి పరారయ్యాడు. పొరుగింటి వారు తక్షణమే స్పందించి ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం భాగ్య బాయి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.