
యువకుడి ఆత్మహత్య
అనంతపురం: తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లి గ్రామానికి చెందిన యువకుడు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గ్రామానికి చెందిన మద్దినేని మనోహర్ నాయుడు, రమణమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు ప్రకాష్‌చౌదరి (22) నర్సరీ నుంచి పదో తరగతి వరకు అనంతపురంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో చదివాడు. అనంతరం గుంటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ పూర్తి చేసి బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ మానేశాడు. ఇరవై రోజుల క్రితం అనంతపురానికి వచ్చి తన స్నేహితులతో కలసి ఆదర్శ నగర్‌లో అద్దె గదిలో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడంతో సోమవారం తెల్లవారు జామున గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారు జామున నిద్రలేచిన స్నేహితులు.. ఉరికి విగతజీవిగా వేలాడుతున్న ప్రకాష్‌చౌదరిని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటినా అనంతపురానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న అనంతపురం రెండో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు. కాగా, సేవా దృక్పథంతో కుమారుని నేత్రాలను తల్లిదండ్రులు దానం చేశారు.