
హామీల అమలుకు పోరాటానికి సిద్ధం
● అంగన్‌వాడీలకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు పిలుపు
అనంతపురం అర్బన్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అంగన్‌వాడీ వర్కర్లకు సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీదేవి పిలుపునిచ్చారు. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్ల సంఘం 8వ జిల్లా మహాసభ ఆదివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో జరిగింది. సంఘం జిల్లా అధ్యక్షురాలు శంకుతల పాతక్క అధ్యక్షతన జరిగిన సభలకు ఓబుళు, శ్రీదేవితో పాటు ఐద్వా రాష్ట్ర కోశాధికారి సావిత్రి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్, సంఘం ప్రధాన కార్యదర్శి రమాదేవి ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. ధరలకు అనుగుణంగా అంగన్‌వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మహాసభలో ఉద్యమ కార్యాచరణపై తీర్మానాలు చేశారు.
వివాహితపై హత్యాయత్నం కేసులో భర్త అరెస్ట్
అనంతపురం: కట్టుకున్న భార్యనే చంపాలని ప్రయత్నం చేసిన భర్త కటకటాలపాలయ్యాడు. వివరాలను అనంతపురం వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆదివారం వెల్లడించారు. అనంతపురం నగరంలోని పవర్ ఆఫీసు వెనుక అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న ఖాజీ తస్లీమా నస్రీన్‌కు ఏడు నెలల క్రితం సంగమేష్ నగర్‌లోని బృహస్పతి పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న కె.రోషన్ జమీర్ ఖాన్‌తో వివాహమైంది. వీరిద్దరిదీ రెండో వివాహమే. పెద్దల సమక్షంలో పెళ్లి చేసే సమయంలో తస్లీమా నస్రీన్ తల్లిదండ్రులు రూ.5 లక్షల నగదు, 12 తులాల బంగారు, రూ.1.50 లక్షల విలువ చేసే ఫర్నీచర్‌ను ఇచ్చారు. వివాహం జరిగినప్పటి నుంచి రోషన్ జమీర్ , అతని తల్లి షమీమ్ భాను, చెల్లెలు నౌజియా సుల్తానా, ఆమె భర్త సలీం, మేనమామ సాదిక్ వలి అందరూ కలిసి మరో రూ.10 లక్షలు కట్నం కింద తీసుకురావాలని ఒత్తిడి చేసేవారు. ఇందుకు నస్రీన్ ఒప్పుకోకపోవడంతో ఈ నెల 15న మోతాదుకు మించి టాబ్లెట్‌లను నీటిలో కలిపి బలవంతంగా నస్రీన్ నోట్లోకి రోషన్ జమీర్ పోసి నోరు అదిమి పెట్టాడు. తర్వాత అపస్మారక స్థితికి చేరుకున్న నస్రీన్‌ను పొరుగింటి వారు వెంటనే సర్వజనాస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు భర్త రోషన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు.
కంటైనర్ – కారు ఢీ
కూడేరు: మండలంలోని శివరాంపేట గ్రామ సమీపంలో అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారిపై ఆదివారం కంటైనర్, కారు ఢీకొన్నాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న మహేష్ ఆయన భార్య, కుమార్తె గాయపడ్డారు. విడపకల్లు మండలం గడేహోతురుకు చెందిన వీరు కారులో బెంగళూరుకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
గుర్తు తెలియని మహిళ మృతి
బత్తలపల్లి: స్థానిక శివాలయం వద్ద ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సోమశేఖర్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. మతిస్థిమితం సరిగా లేని సుమారు 65 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ మహిళ నాగుల కట్ట మీద గత 20 రోజులుగా ఉండేది. చుట్టు పక్కల వారు ఆమెకు ఆహారం ఇచ్చి సౌకర్యాలు కల్పించేవారు. ఆదివారం ఉదయం ఆహారం ఇచ్చేందుకు వెళ్లినప్పుడు అచేతనంగా పడి ఉండడంతో సమాచారం ఇవ్వడంతో పోలీసులు పరిశీలించి, మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96833 కు సమాచారం అందించాలని కోరారు.

హామీల అమలుకు పోరాటానికి సిద్ధం

హామీల అమలుకు పోరాటానికి సిద్ధం