
రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనం
ఉరవకొండ: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా విద్యావ్యవస్థ నాశనమైందని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంస్కరణలతో పూర్తిగా భ్రష్టుపట్టిందని ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపి మూర్తి ధ్వజమెత్తారు. ఉరవకొండలోని గవిమఠం వెనుక ఉన్న సీవీవీ నగర్‌లో యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా సహాయ అధ్యక్షుడు రామప్పచౌదరి అధ్యక్షతన నిర్వహించిన విద్యాసదస్సులో గోపి మూర్తి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యారంగంలో ఏదో ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ఉందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా పడిపోయేలా చేశారన్నారు. రాష్ట్రంలో 9 రకాల పాఠశాలల నిర్వహణ లాంటి అశాస్త్రీయ కార్యక్రమాలతో తీవ్ర గందగోళానికి తెర లేపారన్నారు. రాష్ట్రంలో 4వేల పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు ఉన్నాయంటే ఇందుకు ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ఉపాధ్యాయులు బోధనపై దృష్టి పెట్టకుండా యోగా డే, మెగా పేరేంట్స్ డే అంటూ వారాల పాటు కార్యక్రమాలు నిర్వహించి ఫొటోలు తీయడం, ఆప్‌లోడ్ చేయడమే పనిగా ఉపాధ్యాయులను ఆదేశించడం దుర్మార్గమన్నారు. మాజీ ఎమ్మెల్సీ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వరావు, డాక్టర్ గేయానంద్ మాట్లాడుతూ.. యూటీఎఫ్ ఆవిర్భావం, విధివిధానాలను వివరించారు. యూటీఎఫ్ అలుపెరుగని పోరాటాల ఫలితంగా ఉపాధ్యాయ సమస్యలు విజయవంతంగా పరిష్కారమయ్యాయన్నారు. కార్యక్రమంలో వజ్రకరూరు ఎంఈఓలు ఎర్రిస్వామి, తిమ్మప్ప, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి సంజీవ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి జయచంద్రారెడ్డి, అడిట్ కమిటీ సభ్యుడు రమణయ్య, పూర్వ రాష్ట్ర కార్యదర్శి సుధాకర్, విద్యావేత్త షాషావలి, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల యూటీఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలను
ప్రోత్సహిస్తున్న కూటమి సర్కార్
విద్యా సదస్సులో ఎమ్మెల్సీ గోపిమూర్తి ధ్వజం