
కమనీయం.. రథోత్సవం
బొమ్మనహాళ్: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని బొమ్మనహాళ్ మండలం నేమకల్లులో వెలసిన ఆంజనేయస్వామి బ్రహ్మ రథోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు చేశారు. విశేష అలంకరణల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఉమ్మడి జిల్లా నుంచే కాక, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి ముందే రోజే వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. భక్తులకు స్థానికులు సునీత, శివారెడ్డి ఆధ్వర్యంలో అన్న దానం ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటలకు ఆంజినేయస్వామి ఉత్సవమూర్తిని రథంపైకి చేర్చి.. గోవింద నామ స్మరణతో భక్తులు ముందుకు లాగారు. రాత్రి 7 గంటలకు నిర్వహించిన లంకా దహనం కార్యక్రమం అలరించింది. పూజల్లో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఈఓ నరసింహారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.