
బస్సులు కటకట.. లోపల కిటకిట
● కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు
● సర్వీసులు పెంచకపోవడంపై డ్రైవర్లలో ఆందోళన
అనంతపురం క్రైం: మహిళలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిశాయి. ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు కిటకిటలాడాయి. బస్సుల్లో పరిమితి భారీగా పెరిగిపోయింది. దీంతో డ్రైవర్లు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయదుర్గం నుంచి శనివారం మధ్యాహ్నం అనంతపురం వచ్చిన ఓ ఆర్టీసీ బస్సులో 118 మంది ప్రయాణికులు ఎక్కారు. ఓవరు లోడు కావడంతో సురక్షితంగా బస్సును తీసుకురావడానికి తలప్రాణం తోకకొచ్చినట్లయిందని బస్సు డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేశారు. టైరు పేలినా ప్రాణాలు గాలిలో కలసిపోతాయని వాపోయారు. ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం చాలా ఉందని తెలిపారు. లేకుంటే ఉన్న ఆర్టీసీ బస్సులన్నింటినీ భవిష్యత్‌లో గుజిరీకి వేయాల్సి ఉంటుందని చెప్పారు.
ప్రత్యేకంగా సీట్లు పెట్టండి..
అనంతపురంలో ఓ వృద్ధుడు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ‘పురుషులకు మాత్రమే’ సీట్లు పెట్టించాలని కోరడం గమనార్హం. కనీసం బస్సుకు పది సీట్లైనా కేటాయించాలని ఆయన అధికారులకు విజ్ఞప్తి చేశాడు. లేకుంటే డబ్బిచ్చి కూడా సీటు లేకుండా నిలబడి ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని వాపోయారు.
వాటిలో వర్తించదంట..
జిల్లాకు కర్ణాటక సరిహద్దుగా ఉండటంతో ఆయా ప్రాంతాలకు ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించకపోవడం గమనార్హం. ప్రధానంగా జిల్లాలోని గుంతకల్లు–బళ్లారి, రాయదుర్గం– బళ్లారి, కణేకల్లు– బళ్లారి, కంబదూరు– పావగడ, పేరూరు–పావగడ, బళ్లారి– డీ హీరేహాళ్, ఆర్టీసీ జోనల్ చైర్మన్ పూల నాగరాజు స్వగ్రామమైన గుమ్మఘట్ట, బొమ్మనహాళ్, ఉరవకొండ నుంచి రూపనగూడి, చీకలగుర్కి నుంచి బళ్లారికి వెళ్లే పల్లె వెలుగు బస్సుల్లో ఈ సమస్య బాగా కనిపిస్తోంది. దీంతో మహిళలు ఇంకెందుకు ‘సీ్త్ర శక్తి’ అంటూ వాపోతున్నారు.

బస్సులు కటకట.. లోపల కిటకిట

బస్సులు కటకట.. లోపల కిటకిట