
సీఎం సీట్లో కూర్చునే అర్హత ఉందా బాబూ?
అనంతపురం కార్పొరేషన్: ‘సూపర్‌సిక్స్ పథకాల ద్వారా మొదటి ఏడాదిలో ప్రజలకివ్వాల్సిన రూ.80 వేల కోట్లు ఎగురగొట్టావు. మద్యం పాలసీ ముసుగులో ఆదాయాన్ని పెంచుకునే పనిలో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజునైనా మద్యాన్ని కట్టడి చేయడంపై చంద్రబాబు మాట్లాడతారని ప్రజలంతా భావించారు. ఆ విషయాన్ని పక్కన పెట్టి మద్యాన్ని నాణ్యతగా, సరసమైన ధరలకు అందిస్తామని చెప్పడం సిగ్గుచేటు. నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడే బాబూ.. నీకు సీఎం సీట్లో కూర్చునే అర్హత ఉందా’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. శనివారం నగరంలోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు తీరుపై ‘అనంత’ నిప్పులు చెరిగారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు ప్రజాప్రతినిధుల చేతుల్లో కీలుబొమ్మలు కావడంతో దౌర్జన్యాలు, మహిళలపై అఘాయిత్యాలు పెచ్చుమీరాయన్నారు. మద్యం గురించి ప్రస్తావించి యువతకు చంద్రబాబు ఎలాంటి సందేశమిస్తున్నారని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి’, ‘నిరుద్యోగ భృతి’, 50 ఏళ్లకు పైబడి వారికి పింఛన్ ఇవ్వలేదన్నారు. ఉచిత బస్సుకు సంబంధించి కేవలం 7 రకాల సర్వీసుల్లో మహిళలకు అవకాశం కల్పించారని, పక్క రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ తరహాలో అమలు చేయలేదని దుయ్యబట్టారు.
రైతన్నకు అడుగడుగునా అన్యాయం..
‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని చెప్పి రైతాంగాన్ని చంద్రబాబు వంచించారన్నారు. గత ప్రభుత్వంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు మేలు చేసేలా అప్పటి సీఎం వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2024–25లో ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి 86 లక్షల ఎకరాల్లో ప్రీమియం చెల్లించాల్సి ఉంటే ఇప్పటి వరకు 14 లక్షల ఎకరాలకు మాత్రమే రైతులు చెల్లించారని చెప్పారు.అతివృష్టి, అనావృష్టి కారణంగా వేరుశనగ, పత్తి, ఆముదం, కందులు వేసుకునే పరిస్థితి లేదని, కనీసం రైతులను ఆదుకునేలా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదని వాపోయారు. రైతుల పట్ల కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తుండడం అన్యాయ మన్నారు. యూరియా, డీఏపీ తదితర ఎరువులు డిస్ట్రిబ్యూటర్ నుంచి ఎక్కడకు వెళ్తున్నాయో నిఘా ఉంచాలని, బస్తాపై అదనంగా రూ.50–రూ.100 వరకూ రైతుల నుంచి వసూలు చేస్తున్నారని, వీటిని అరికట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని తాము కలెక్టర్‌కు విన్నవించినా పట్టించుకోలేదన్నారు.
శ్రావణి మృతిపై విచారణ చేయాలి...
జిల్లా కేంద్రంలో విద్యార్థి తన్మయి హత్యతో పాటు ఉమ్మడి జిల్లాలో మహిళలు, మైనర్లపై అఘాయిత్యాలు జరిగినా పోలీసు వ్యవస్థ ఏమాత్రం మేలుకోలేదని విమర్శించారు. తన్మయి విషయంలో ఆందోళన చేస్తే సీఐను సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. ఇలాంటి ఉదాసీనత కారణంగానే తాజాగా కళ్యాణదుర్గంలో గర్భిణీ శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపించారు. భర్త, అత్తామామలు, పోలీసులు, టీడీపీ నాయకులు తనను ఇబ్బందులకు గురి చేశారని, వారి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటానని ఓ నిండు గర్భిణీ చెప్పడం కలచివేస్తోందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్‌ను కలిసి తాము విన్నవిస్తే కళ్యాణదుర్గం పోలీసులే విచారణ చేస్తారని చెప్పడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఓ యువ ఐపీఎస్ ఇటువంటి సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం పోలీసుల కారణంగా ఇబ్బంది పడినట్లు గర్భిణీ చెప్పిందని గుర్తు చేశారు. ఈ విషయంలో నిష్పాక్షికంగా విచారణ చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున
మద్యం పాలసీపై మాట్లాడతావా?
‘దుర్గం’లో గర్భిణి మృతిపై
నిష్పాక్షికంగా విచారణ చేయాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి