
రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఈనెల 18న కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూభవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితి గురించి కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ అర్జీలను పరిష్కార వేదిక ద్వారానే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు: మూడు రోజులు వరుస సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని 17,18వ తేదీల్లో తిరుపతి–సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నట్లు సీనియర్ డీసీఎం మనోజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తిరుపతి జంక్షన్‌లో రైలు (07097) ఆదివారం (నేడు) రాత్రి 9.10 గంటలకు బయలుదేరి సోమవారం ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ చేరుతుందన్నారు. తిరిగి ఈ రైలు (07098) సోమవారం సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతి జంక్షన్ చేరుకుంటుందన్నారు. రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, కృష్ణా, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా రైలు ప్రయాణం సాగిస్తుందన్నారు. సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
15 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 15 మండలాల పరిధిలో 6.3 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. వజ్రకరూరు 52 మి.మీ, తాడిపత్రి 31.4, పెద్దవడుగూరు 29.6, యాడికి 19.2, విడపనకల్లు 16.2, గుత్తి 11.4, పామిడి 10.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 88.3 మి.మీ కాగా 145 మి.మీ వర్షం పడింది. ఓవరాల్‌గా జూన్ 1 నుంచి 165 మి.మీ గానూ 38 శాతం అధికంగా 228 మి.మీ నమోదైంది. 14 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి. 23 మండలాల్లో సాధారణం కన్నా అధికంగా, మరో 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తే చర్యలు
● డీఎస్పీ వెంకటేశ్వర్లు
గార్లదిన్నె: అనుమతులు లేకుండా ఎర్రమట్టి తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ‘యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. జంబులదిన్నె కొట్టాల వద్ద మట్టి తవ్వకాలు చేసిన ప్రభుత్వ గుట్టను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ మైనింగ్ శాఖ నుంచి అనుమతులు ఉంటేనే మట్టి తరలించాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా, ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించకుండా మట్టిని ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అక్రమంగా ఎవరైనా మట్టి తరలిస్తే అధికారులకు సమా చారం అందించాలని కోరారు. అనంతరం గార్లదిన్నె పోలీస్ స్టేషన్‌ను డీఎస్పీ తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. మండలంలో క్రైమ్ రేట్ తగ్గించి, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

రేపు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’