
అందని అంగన్‌వాడీ సరుకులు
తాడిపత్రి రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు, ఇతర సరుకుల పంపిణీ నిలిచిపోయింది. ప్రతి నెలా మొదటి వారంలోనే పంపిణీ కావాల్సిన సరుకులు ఈ సారి రెండో వారం దాటినా లబ్ధిదారులకు అందించలేదు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో 3.20 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. గర్భిణులు, బాలింతలకు ప్రతి నెలా మూడు కిలోల బియ్యం ప్యాకెట్లు, కిలో కందిబేడలు, అర కిలో ఆయిల్, 25 కోడిగుడ్లు, తల్లులకు 5, చిన్నారులకు 2.5 లీటర్ల పాలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే కేంద్రాలకు ఆగస్టు మొదటి వారం మొదటి విడతగా సరుకులు వచ్చి చేరాయి. అంగన్‌వాడీలకు ప్రభుత్వం అందించిన సెల్‌ఫోన్ యాప్‌లలో వివరాల నమోదు ఆధారంగా సరుకులు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు, యాప్‌ల భారం తదితర కారణాలతో ఈ నెల 5న ఉమ్మడి జిల్లాలో చాలామంది అంగన్‌వాడీ కార్యకర్తలు సెల్‌ఫోన్లను ఉన్నతాధికారులకు వెనక్కు ఇచ్చేశారు. దీంతో లబ్ధిదారులకు సరుకులు పంపిణీ చేయలేదు. కొన్ని చోట్ల రికార్డుల్లో సంతకాలు పెట్టించుకొని లబ్ధిదారులకు అందజేస్తున్నట్లు తెలిసింది.
పట్టని అధికారులు..
లబ్ధిదారులకు సరుకులు అందకున్నా ఐసీడీఎస్ అధికారులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. అధికారుల ఆదేశాల కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రెండు విడతలకు సంబంధించి లక్షల్లో గుడ్లు నిల్వ ఉన్నాయి. ఇవి చెడిపోకముందే పంపిణీ చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.