
అభాగ్యులకు అమ్మ భరోసా
తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు.. ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న పేదలను చూస్తే ఆయన హృదయం కరిగిపోతుంది. ఊహించని ప్రమాదాలు.. అనారోగ్యాల బారినపడి వైద్యం చేయించుకోలేని స్థితిలో ఇబ్బంది పడుతున్న వారి గురించి తెలిస్తే చలించిపోతారు. పేదరికంతో కుటుంబాన్ని పోషించలేక పిల్లలను పస్తులుంచుతున్న దృశ్యాలు ఆయన్ను కదిలిస్తాయి. ఇలా ఎందరో అభాగ్యులను ‘అమ్మ’లా అక్కున చేర్చుకుని చేతనైన సహాయం చేస్తున్నారు స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు తరిమెల రమణారెడ్డి. ఆయన స్థాపించిన ‘అమ్మ’ సంస్థ సామాజిక సేవలో 25 వసంతాలు పూర్తి చేసుకుంది. అభాగ్యుల జీవితాలకు భరోసా కల్పిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న రమణారెడ్డి జీవితం ఎందరికో ఆదర్శం.
●విద్య, వైద్య సాయంతో పాటు కుటుంబాలకు చేయూత ●పాతికేళ్లు దాటిన ‘అమ్మ’ స్వచ్ఛంద సంస్థ సేవా ప్రస్థానం
అనంతపురం కల్చరల్: కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం కదిరిదేవరపల్లికి చెందిన ఆంజనేయులు, పుల్లమ్మ దంపతులు. వారి ముగ్గురు పిల్లలూ గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అందరికీ ఆపరేషన్లు అయితే తప్ప బతకడం సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు. అయితే వారికి అంతటి ఆర్థిక స్థితి లేదు. ఎక్కడా వారికి భరోసా కూడా దక్కలేదు. విషయం తెలిసిన ‘అమ్మ’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు తరిమెల రమణారెడ్డి ముందుకొచ్చారు. ఆపరేషన్లకు అవసరమైన రూ.8 లక్షలు అందించి వారికి పునర్జన్మ ప్రసాదించారు. సాటి మనిషికి సేవ చేయడంలో ఉన్న సంతృప్తి ఆయన్ను ముందుకు నడిపిస్తోంది.
‘అమ్మ’ సంస్థకు అంకురార్పణ ఇలా..
రెండున్నర దశాబ్దాల కిందట ఆగస్టులో స్వాతంత్య్ర వేడుకలు సాగుతున్న వేళ అనంతపురానికి చెందిన తరిమెల రమణారెడ్డి స్నేహితురాలు ప్రమాదానికి గురైంది. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆమెకు ఆయనే రక్తదానం చేసి బతికించుకున్నారు. ఆ సందర్భంలో వారి కృతజ్ఞత, అవసరానికి ఆదుకునే మనుషుల అవసరాన్ని గుర్తించిన తరిమెల రమణారెడ్డి అనురాగానికి మారుపేరైన ‘అమ్మ’ పేరుతోనే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రారంభించారు. తన సంపాదనలోనే కొంత భాగాన్ని సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన వారి గురించి, ప్రతిభ ఉండి ఉన్నత విద్యనభ్యసించలేకపోతున్న వారి గురించి తెలిసినా.. తన దృష్టికి వచ్చినా అలాంటి వారిని అక్కున చేర్చుకుని.. వారికి అవసరమైన సహాయ సహకారాలందించి వెన్నదన్నుగా నిలుస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనాథలు, నిస్సహాయ స్థితిలోని 65 మంది పేదింటి పిల్లల ఉన్నత విద్యకు, పేదరికంతో బాధపడుతున్న 220 మందికి నిత్యావసర సరుకులతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చారు. పలువురికి స్వయం ఉపాధి కల్పించి గౌరవంగా బతికేలా చేయూతనందించారు. ఇక 142 మందికి వైద్యసాయం అందించి మానవత్వం చాటుకున్నారు.
సామాజిక సేవకు ముందుకు రావాలి
లోకంలో స్వార్థం పెరిగిపోతోంది. సొంత బంధువులకు కూడా సాయపడలేని స్థితికి వస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సాటి మనిషికి సాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. ధనవంతులు, స్థితిమంతులు మానవతాదృక్పథంతో తమ సంపాదనలో కొంత సమాజానికి కేటాయించగలిగితే ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. నాకు సేవ చేసుకునే భాగ్యం కల్పించింది మా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే. నాకు ప్రసాదరెడ్డి, స్వరాజ్యలక్ష్మి దంపతులు జన్మనిస్తే, రంగనాయకమ్మ, కుళ్లాయిరెడ్డి దంపతులు మరో జీవితం ప్రసాదించారు. భార్య లక్ష్మి, కొడుకు సాయి సిద్ధార్ధరెడ్డి ప్రోత్సాహంతో నేను ‘అమ్మ’ సంస్థ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నడపగలుగుతున్నాను.
– తరిమెల రమణారెడ్డి, వ్యవస్థాపకుడు, అమ్మ సంస్థ

అభాగ్యులకు అమ్మ భరోసా

అభాగ్యులకు అమ్మ భరోసా