
బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
అనంతపురం అర్బన్: బీడీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏపీ బీడీ, సిగార్ కార్మికుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జి.ఓబుళు డిమాండ్ చేశారు. ఇందుకోసం అక్టోబరు నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. శనివారం స్థానిక గణేనాయక్ భవన్‌లో సంఘం రాష్ట్ర కో–కన్వీనర్ పి.ఇక్బాల్‌బాషా అధ్యక్షతన రాష్ట్ర సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబుళు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వేల కుటుంబాలు బీడీలు చుట్టడం, కట్టలు కట్టడం వంటి పనులు చేస్తున్నాయన్నారు. నిరంతరం పనులు చేస్తున్న కారణంగా క్షయ, వెన్నునొప్పి, ఇతర జబ్బులకు గురవుతున్నారని తెలిపారు. వీరికి వైద్యం అందించేందుకు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు, వైద్య సిబ్బంది లేకపోవడం బాధాకరమన్నారు. కార్మికులకు తక్కువ వేతనాలు ఇస్తూ కంపెనీలు పెద్దఎత్తున లబ్ధి పొందుతున్నాయన్నారు. బీడీ ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం 28 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తోందని, అయితే కార్మికుల సంక్షేమాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈఎస్‌ఐ, పీఎఫ్ అమలు చేయాలన్నారు. సమావేశంలో నాయకులు అబ్దుల్ దేశాయ్, సుధాకర్, జీఎల్ నరసింహులు, జగన్, ఉమాగౌడ్ పాల్గొన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
● ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం
అనంతపురం ఎడ్యుకేషన్: ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ఏపీజీఏ) లక్ష్యం అని జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోపీకృష్ణ, రామునాయక్ పేర్కొన్నారు. శనివారం అనంతపురంలోని సంఘం కార్యాలయంలో ఏడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ ఉద్యోగుల్లో నెలకొన్న అభద్రతాభావాన్ని సంఘం ద్వారా తొలగించేందుకు కృషి చేశామన్నారు. ఉద్యోగుల హక్కుల సాధనలో రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఉద్యోగవర్గాలకు తమవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాకులు, పెన్షనర్లకు దాదాపు రూ. వేల కోట్ల ఆర్థిక బకాయిలున్నాయన్నారు. పెన్షనర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారిందన్నారు. సీపీఎస్, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలు ఇంతవరకూ పరిష్కారం కాలేదన్నారు. పెండింగ్ బకాయిలపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం మహిళా విభాగం సాంబశివమ్మ, సుజాత, నగర కమిటీ శ్రీనివాసులు, సుధాకర్, మౌలాసాబ్, నాగరాజు, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

బీడీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి