
‘పల్లె’కు అధికారుల జీ హుజూర్!
ప్రశాంతి నిలయం: ఆయనేమీ ప్రజాప్రతినిధి కాదు. తెలుగుదేశం పార్టీ నేత. అయినా అధికారిక కార్యక్రమాల్లో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి..? అధికారం మాది.. ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణితో ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా కలెక్టరేట్‌లో కలెక్టర్ సీటులోనే కూర్చుని టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు కూడా ఆయనకు అడ్డు చెప్పకుండా ‘జీ హుజూర్’ అంటూ మిన్నకుండిపోవడం గమనార్హం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ఎలాంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ పాల్గొంటున్నారు. ఇంతటితో ఆగకుండా ఏకంగా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. తాజాగా శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఆయన టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఏకంగా కలెక్టర్ కుర్చీలో ఆశీనుడై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఇంత జరుగుతున్నా కలెక్టరేట్ అధికారులు అడ్డుచెప్పకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టరేట్‌ను పార్టీ కార్యాలయంగా మార్చేస్తూ సమావేశం నిర్వహించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఎమ్మెల్యే ఉన్నా.. అన్నీ తానై..
మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా ఆయనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. అధికారుల బదిలీలు, నియామకాలు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు.. ఇలా ఏ కార్యక్రమమైనా ఆయనే ముందుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు సైతం ఎమ్మెల్యేకు బదులు తానే హాజరవుతున్నారు. ఈ విషయంలో ప్రజల నుంచి విమర్శలు వచ్చినా లెక్క చేయడం లేదు. తన కోడలికి ఏమీ తెలియదని, అందుకే తాను ముందుండి నడిపిస్తున్నానని చెప్పుకుంటున్నారు.
కలెక్టరేట్‌లో టీడీపీ నేతలతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమీక్ష
ఏకంగా కలెక్టర్ కుర్చీలో కూర్చున్న వైనం
అడ్డు చెప్పని కలెక్టరేట్ అధికారులు

‘పల్లె’కు అధికారుల జీ హుజూర్!