
జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్
అనంతపురం: జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. పలు సమస్యాత్మక గ్రామాలు, కాలనీల్లో శనివారం తెల్లవారుజాము నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఫుట్ పెట్రోలింగ్, గ్రామస్తులతో సమావేశాలు నిర్వహించారు. గంజాయితో కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, మహిళలపై నేరాలు, శక్తి యాప్, డయల్–100, సీసీ కెమెరాల ప్రాముఖ్యత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్స్, అనుమానితులు, పాత కేసుల్లోని నిందితులపై ప్రత్యేక నిఘా వేసి ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. పాత కేసుల్లోని నిందితులతో సమావేశమై.. పాత పంథా కొనసాగించకుండా సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
గంజాయి ముఠా అరెస్ట్
తాడిపత్రిటౌన్: గంజాయి ముఠాను తాడిపత్రి పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 610 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ శివగంగాధర్‌రెడ్డి పోలీస్ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ఏఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరికి వచ్చిన సమాచారం మేరకు రూరల్ పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది, వ్యవసాయాధికారులతో కలిసి స్థానిక చుక్కలూరు రోడ్డులో అనుమానాస్పదనంగా ఉన్న ఇద్దరు (ఓ వ్యక్తి– మైనర్ బాలుడు) వ్యక్తులను తనిఖీ చేయగా.. వారి వద్ద డ్రై గంజాయి లభించింది. దీంతో కర్నూలు జిల్లా ఆత్మకూరు చెందిన శేషాద్రిని అరెస్టు చేసి.. 16 సంవత్సరాల బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. వీరు ఒడిశాలో గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరకు అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తూ జీవిస్తున్నారు. ఇప్పటి వరకు వీరు తాడిపత్రి శివారు, నందలపాడు వంటి ప్రాంతాల్లో మూడుసార్లు గంజాయి విక్రయించినట్లు విచారణలో తేలిందని సీఐ తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా కార్డెన్ సెర్చ్