
యాడికి కానిస్టేబుల్‌కు ‘చంద్రబోస్ ఐకాన్’ అవార్డు
● ఉత్తమ పోలీస్ అవార్డు సైతం..
యాడికి: అరుదైన పురాతన నాణేలు సేకరిస్తున్న వారిని ప్రోత్సహించేలా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌కు చెందిన జీవన జాగృతి ఆర్గనైజేషన్ పురాతన నాణేల పరిశోధన సంస్థ అంద జేస్తున్న ‘సుభాష్ చంద్రబోస్ ఐకాన్’ అవార్డుకు యాడికి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విష్ణు భగవాన్ ఎంపికయ్యారు. ఏటా ప్రయాగ్‌రాజ్‌కు చెందిన జీవన్ జాగృతి ఆర్గనైజేషన్ వారు తమ సంస్థ తరపున అవార్డును అందజేస్తుంటారు. ఈ ఏడాది ఎంపికై న వారిలో తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారి విష్ణు భగవాన్ ఎంపిక కావడం గమనార్హం. ఈ మేరకు గురువారం ఆ సంస్థ నుంచి విష్ణు భగవాన్‌కు సందేశం అందింది. కానీ తాడిపత్రిలో ఏఎస్‌పీ రోహిత్ కుమార్‌చౌదరి ద్వారా నిర్వహిస్తున్న స్పెషల్ టీమ్‌లో విధులు నిర్వహిస్తుండటంతో ఉత్తమ పోలీసు అవార్డు రావటంతో అనంతపురంలో శుక్రవారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ చేతుల మీదుగా ఎస్పీ జగదీష్ సమక్షంలో ‘ఉత్తమ పోలీస్’ అవార్డు అందుకున్నారు. దీంతో విష్ణుభగవాన్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అవార్డు కార్యక్రమానికి హాజరుకాలేనని వారికి సమాచారం అందజేశారు. దీంతో ఆ సంస్థ వారు పోస్టల్ ద్వారా అవార్డును చేరవేస్తామని విష్ణు భగవాన్‌కు తెలిపారు. అనంతపురంలో ఉత్తమ పోలీసు అవార్డు అందుకోవడం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం తరఫున ‘సుభాష్ చంద్రబోస్ ఐకాన్’ అవార్డు పొందిన యాడికి కానిస్టేబుల్ విష్ణు భగవాన్‌ను ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి, యాడికి సీఐ ఈరన్న, ఎస్‌ఐ రమణ, పోలీసు సిబ్బంది శనివారం అభినందించారు.