
అప్రమత్తంగా వ్యవహరించాలి
● భద్రత చర్యలు మమ్మురం చేయాలి
● రైల్వే జీఎం సంజయ్‌కుమార్
గుంతకల్లు: ప్రసుత్త రుతుపవనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు అప్రమత్తంగా వ్యవహరించడంతోపాటు భద్రతా చర్యలు మమ్మురం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ్ ఆదేశించారు. శనివారం జోనల్ పరిధిలోని గుంతకల్లు, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డీఆర్‌ఎం, ఏడీఆర్‌ఎం, డివిజన్ స్థాయి ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే జీఎం మాట్లాడుతూ వర్షాకాలంలో ముంపునకు ఎక్కువగా గురయ్యే వంతెనలు, సొరంగాలు, రోడ్డు అండర్ బ్రిడ్జిలు వంటి ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలన్నారు. అక్కడ ఇసుక, బ్యాలస్ట్, సిమెంట్, బండరాళ్లు, పైపులు అందుబాటులో ఉన్నాయా? లేదా పరిశీలించుకోవాలన్నారు. స్టేషన్ యార్డుల్లో డ్రెయినేజీ వ్యవస్థ, పంపింగ్, సున్నితమైన ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నిఘా పెట్టాలన్నారు. అంతేకాకుండా పెరిగిన చెట్ల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి తొలగించాలన్నారు. విపత్తు నిర్వహణ గదిని తనిఖీలు చేయడంతోపాటు 24 గంటలూ పర్యవేక్షణ చేయాలన్నారు. అవరోధాలు ఎదురై సమయాల్లో ప్రయాణికులకు కచ్చితమైన సమాచారం అందించడానికి ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరించేలా చూసుకోవాలన్నారు. ప్రయాణికుల భద్రత, కార్యాచరణ నైపుణ్యం పట్ల మీ నిబద్ధతను చాటి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, ఏడీఆర్‌ఎం సుధాకర్, డివిజన్ స్థాయి ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.