
●కసాపురం.. భక్తజనసంద్రం
● నెట్టికంటుడి నామస్మరణతో మార్మోగిన ఆలయ పురవీధులు
గుంతకల్లు రూరల్: శ్రావణ మాసం నాలుగో శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం భక్తులతో పోటెత్తింది. స్వామి నామస్మరణతో ఆలయ పురవీధులు మార్మోగాయి. వేకువజామునే అభిషేకాలు నిర్వహించిన అర్చకులు స్వామివారిని స్వర్ణ కవచ అలంకరణలో తీర్చిదిద్ది ప్రత్యేక పూజలు చేసి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. జిల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు. సాయంత్రం సీతారామలక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వార్లను గరుడ వాహనంపై కొలువుదీర్చి ఈఓ ఎం.విజయరాజు, ఆలయ అనువంశిక ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్లను ఊరేగిస్తూ ఆలయం చుట్టూ ప్రాకారోత్సవం నిర్వహించారు.