
యువకుడి ఆత్మహత్య
పెద్దవడుగూరు: క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పెద్దవడుగూరులోని నరసింహ కాలనీలో నివాసముంటున్న రాజేష్ (23)కు ఇటీవల అదే గ్రామానికి చెందిన అరుణతో వివాహమైంది. తరచూ అరుణను తల్లి పుట్టింటికి పిలుచుకెళుతుండడంతో క్షణికావేశానికి లోనైన రాజేష్.. గురువారం తెల్లవారుజామున కాలనీ సమీపంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై ఎస్‌ఐ ఆంజనేయులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
జిల్లాకు 1,950 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: ఇఫ్కో కంపెనీకి చెందిన 1,200 మెట్రిక్ టన్నుల డీఏపీ, 750 మెట్రిక్ టన్నుల 20–20–0–13 రకం కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు సరఫరా అయినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ జీఎం అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్ పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన ఎరువులను ఆయన గురువారం పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ ప్రకారం ఎరువులను మార్క్‌ఫెడ్‌కు, ప్రైవేట్ డీలర్లకు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఖైదీ మృతిపై
18న ఆర్డీఓ విచారణ
ధర్మవరం అర్బన్: ఈ ఏడాది జనవరి 14న అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతూ ధర్మవరం సబ్‌జైల్‌లోని రిమాండ్ ఖైదీ మృతి చెందిన అంశంపై ఈ నెల 18న ఆర్డీఓ విచారణ చేపట్టనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ మహేష్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పామిడి మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన కాడింటి కేశవనారాయణ అలియాస్ శివయ్య ఉరఫ్ శ్రీనివాసులు(50) ధర్మవరం సబ్ జైలులో రిమాండ్ ఖైదీ (నం.1254)గా ఉండేవాడు. అనారోగ్యంతో బాధపడుతుండగా సర్వజనాస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందిన అంశంపై విచారణ చేయాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 18న ఉదయం 11గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో విచారణ ఉంటుందని, దీనిపై ఆక్షేపణలున్నవారు అఫిడవిట్ రూపంగా కానీ, ప్రత్యక్షంగా కాని అందజేయాలని ఆర్డీఓ కోరారు.

యువకుడి ఆత్మహత్య