
ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం
అనంతపురం కార్పొరేషన్: సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. బాబు దిగుజారుడు రాజకీయాలకు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డితో కలసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నిరంకుశంగా పాలన సాగిస్తున్నారన్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే కాకుండా, ఎవరైనా విమర్శించినా, గొంతెత్తినా పోలీసులను అడ్డుపెట్టుకుని అణచి వేయాలనే నీచ రాజకీయాలకు చంద్రబాబు అండ్ కో పాల్పడుతోందని మండిపడ్డారు. ఇప్పటివరకూ తాను ఏడు ఎన్నికల్లో పోటీ చేశానని, ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యాన్ని నేడు నడిరోడ్డులో హత్య చేశారన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరిపారా బాబూ అని ప్రశ్నించారు. ఎన్నికలు జరిగే ప్రాంతంలోని వారితో కాకుండా ఇతర నియోజకవర్గాల నుంచి మనుషులను పిలిపించి దొంగ ఓట్లు వేశారన్నారు. ఉదయం నుంచే అన్ని పోలింగ్ బూత్‌లను హస్తగతం చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దొంగ ఓటింగ్ జరిగిందని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బతికిద్దామన్న ఆలోచనను ఎన్నికల సంఘం చేయకపోవడం దారుణమన్నారు. సాక్షాత్తు కలెక్టర్ ముందే అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తక్షణం ఎన్నికలను రద్దు చేసి మరోసారి ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలన్నారు. ‘కూటమి’ ప్రజాప్రతినిధులకు నిజంగా గత ఎన్నికల్లో గెలిచామని నమ్మకం ఉంటే మరోసారి ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
దద్దమ్మ ప్రభుత్వం..
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికల బరిలోకి దిగాల్సిన కూటమి ప్రభుత్వం దొంగ చాటున ఎన్నికల్లో గెలిచిందని, ఇవాళ ఏదో గెలిచామంటూ చంకలు గుద్దుకుంటున్నారని, ఇది దద్దమ్మ ప్రభుత్వమని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలను ఏకపక్షంగా నిర్వహించారన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించకుండా కూటమి ప్రభుత్వానికి వంత పాడారని దుయ్యబట్టారు. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు మరెక్కడా ఉండవన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, 3 లక్షల మందికి వలంటీర్లుగా అవకాశం, పరిశ్రమలకు సంబంధించి రూ.47,485 కోట్లతో 28,343 యూనిట్ల ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఒక్క హామీనైనా కూటమి ప్రభుత్వం సరిగా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. ప్రకటించిన పథకాల్లోనూ అర్హులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో తప్పక బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, నాయకులు కొర్రపాడు హుస్సేన్ పీరా, అనిల్‌కుమార్ గౌడ్, కాకర్ల శ్రీనివాస్ రెడ్డి, హుస్సేన్, కోటేశ్వర్ రెడ్డి, సాకే శివశంకర్, సాకే మణికంఠ, గుజ్జల సర్దార్, సంగమేష్, సంపంగి రాయుడు, గుజ్జల నారాయణ, రమణ, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎన్నికలకు సిద్ధమవ్వాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
దద్దమ్మ ప్రభుత్వం ఇది: పార్టీ ట్రేడ్ యూనియన్
రాష్ట్ర అధ్యక్షుడు గౌతం రెడ్డి