
ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి
బ్రహ్మసముద్రం: మండలంలోని చెలిమేపల్లి, బుడిమేపల్లి తదితర గ్రామాల్లో ఉన్న ఎస్సీ కాలనీల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించాలంటూ బ్రహ్మసముద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయం ఎదుట ఆయా గ్రామాల ప్రజలు బుధవారం ధర్నా చేపట్టారు. చెలిమేపల్లిలోని ఎస్సీ కాలనీలో కరెంటు స్తంభాలు కూలడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇటీవల గాలి వానకు కరెంటు తీగలు తెగిపడటంతో ఓ పెంపుడు కుక్క మృతి చెందిందన్నారు. చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన తీగలు తెగి కింద పడుతున్నాయని, ఇలా జరిగిన ప్రతిసారీ కాలనీ వాసులంతా చందాలు వేసుకుని మరమ్మతలు చేయించుకుంటున్నారని వాపోయారు. కాలనీల్లో ఇలాంటి అగచాట్లు ఇంకా ఎన్నాళ్లు భరించాలని ఆవేదనతో విద్యుత్ అధికారుల వద్ద మొర పెట్టుకునేందుకు వస్తే మధ్యాహ్నం 12 గంటలైనా ఒక్కరూ కూడా రాలేదని మండిపడ్డారు. దీంతో వినతి పత్రాన్ని కార్యాలయం తలుపునకు అతికించి నిరసన వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు.
‘అనంత’ ఎమ్మెల్యే వసూళ్లకు హద్దేదీ?
● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజం
అనంతపురం అర్బన్: జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెచ్చుమీరాయని, స్వయానా టీడీపీ ఎమ్మెల్యేనే అక్రమాలకు ఊతమిస్తూ సాగిస్తున్న వసూళ్లకు హద్దనేది లేకుండా పోయిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అనంతపురంలోని కనకదాస ఫంక్షన్ హాల్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనంతపురం నగరంలో దౌర్జన్యాలు, బెదిరింపులు, కబ్జాలు, అడ్డగోలు అవినీతి పెరిగిపోయాయన్నారు. ఈ అక్రమాలపై సీఎం చంద్రబాబు దృష్టి సారించాలన్నారు. ‘లే అవుట్‌లు వేస్తే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వాలి. మాల్ ఓపెన్ చేస్తే డబ్బులివ్వాలి. బ్రాందీ షాపులన్నీ ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. చికెన్ సెంటర్ల నిర్వహణకూ డబ్బు ఇవ్వాలి. చివరికి బుడబుక్కల వారి భూమి కూడా తనదే అనే స్థాయికి ఎదిగారు’ అంటూ ధ్వజమెత్తారు. నగరంలో వాణిజ్య దుకాణదారులనూ వదిలి పెట్టడం లేదని మండిపడ్డారు. జిల్లా కేంద్రంలోని ఏ కార్యాలయంలోకి వెళ్లినా అవినీతికి అడ్డులేకుండా పోయిందన్నారు. అనంత రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్థితి ఏనాడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు. రాష్ట్రంలోని విలువైన భూములను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్లకు కూటమి ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం అన్యాయమన్నారు. టూరిజం శాఖ పరిధిలోని విలువైన ఆస్తులను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దల దిగజారుడుతనం పరాకాష్టకు చేరుకుందనేందుకు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణనే నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను ఆపకుండా మిట్టాల్‌కు ఊడిగం చేస్తూ మిట్టాల్ ఉక్కు పరిశ్రమకు అనుమతులు, రాయితీలు ఇవ్వాలంటూ కేంద్రం వద్ద పైరవీలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై మహాసభలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు.

ఎస్సీ కాలనీల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి