
హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజనల్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.రమణ ప్రసాద్ పేర్కొన్నారు. తిరుపతిలోని ‘స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్‌లైడ్ న్యూట్రిసియన్’లో 2025–26 విద్యా సంవత్సరానికి గాను హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. బీఎస్సీ (హెచ్‌ఏ అండ్ హెచ్‌ఏ) మూడేళ్ల డిగ్రీ కోర్సుకు ఇంటర్‌లో 40 శాతం పైబడి మార్కులు సాధించిన వారు అర్హులు. క్రాప్ట్ కోర్సు ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ పెటినరీ కోర్సు, సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీస్ (సీసీఎఫ్‌బీఎస్) కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. కోర్సులు పూర్తయిన తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. పూర్తి వివరాలకు www.sihmtpt.org వెబ్‌సైట్‌ను పరిశీలించవచ్చు, లేదా 97013 43846, 91005 58006, 97004 40604లో సంప్రదించవచ్చు.
వడ్ల రాజమ్మ దేహదానం
అనంతపురం మెడికల్: మరణానంతరం వైద్య కళాశాలకు దేహదానాన్ని చేయడం ద్వారా మానవ శరీర నిర్మాణంపై వైద్య విద్యార్థుల అభ్యాసనకు దోహదపడుతుందని అనంతపురంలోని నిర్మలానంద నగర్‌లో నివాసముంటున్న తెలుగు వెలుగు సాహితీ సంస్థ అధ్యక్షుడు టీవీ రెడ్డి అన్నారు. ఈ నెల 12న ఊపిరి తిత్తుల సమస్యతో బాధపడుతూ ఆయన భార్య, విశ్రాంత అంగన్‌వాడీ టీచర్ వడ్ల రాజమ్మ మృతి చెందింది. దీంతో బుధవారం సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురం వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ షారోన్ సోనియాకు వడ్ల రాజమ్మ మృతదేహాన్ని ఆయన అప్పగించి, మాట్లాడారు. ఈ సందర్భంగా టీవీ రెడ్డికి ప్రశంసాపత్రాన్ని డాక్టర్ షారోన్ సోనియా అందజేశారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణలకు మృతదేహాల అవసరం ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు తరిమెల అమరనాథ్‌రెడ్డి, గురునాథ్, సలీం, జూటూరు షరీఫ్, విజయసాయి పాల్గొన్నారు.
రేషన్ బియ్యం డంప్ స్వాధీనం
గుంతకల్లు రూరల్: పట్టణ శివారులోని పారిశ్రామిక వాడ సమీపంలో బహిరంగ ప్రదేశంలో డంప్ చేసిన 157 బస్తాల్లోని 78.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని బుధవారం రాత్రి సీఎస్‌డీటీ సుబ్బలక్ష్మి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట కసాపురం ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి ఉన్నారు. బియ్యాన్ని డంప్ చేసిన వారు ఎవరనే విషయంపై విచారణ చేపట్టినట్లు తెలిపారు.

హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు దరఖాస్తు చేసుకోండి