
పరారీలో రైస్ మిల్లు ఓనర్
యాడికి: టన్నుల కొద్దీ రేషన్ బియ్యాన్ని మిల్లులో డంప్ చేసి బెంగళూరుకు తరలించేందుకు సిద్ధమైన యాడికిలోని రైల్ మిల్లు ఓనర్ బలరాముడుతో పాటు, మూడు వాహనాల డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు బలరాముడు పరారీలో ఉండగా మిగిలిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. యాడికి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను సీఐ ఈరన్న, సీఎస్‌డీటీ మల్లేసు వివరించారు. తాడిపత్రి ఏఎస్‌పీ రోహిత్‌కుమార్ చౌదరి అందించిన ముందస్తు సమాచారంతో అప్రమత్తమైన యాడికి సీఐ ఈరన్న, సిబ్బంది, సీఎస్‌డీటీ మల్లేసుతో కలసి ఈ నెల 10న తెల్లవారుజామున 4 గంటలకు లారీ, బొలెరో, ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం వాహన డ్రైవర్లు ఇచ్చిన సమాచారంతో ఏఎస్‌పీ రోహిత్‌కుమార్ చౌదరి అనుమతులు తీసుకుని రెవెన్యూ అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో యాడికిలోని బలరాముడు రైస్ మిల్లులో తనిఖీలు చేపట్టారు. అక్కడ టన్నుల కొద్దీ రేషన్ బియ్యం నిల్వలను గుర్తించారు. మొత్తం 271 టన్నుల రేషన్ బియ్యాన్ని మూడు రోజులుగా 10 లారీల ద్వారా గుంతకల్లులోని బఫర్ గోదాముకు తరలించారు. అనంతరం తహసీల్దార్ ప్రతాపరెడ్డి, పెద్ద మనుసులతో కలిసి బలరాముడు రైస్ మిల్లును సీజ్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రైస్ మిల్లు ఓనర్ బలరాముడితో పాటు వాహన డ్రైవర్లు తాడిపత్రికి చెందిన మసూద్ వలి, యాడికి మండలం కేశవరాయుని పేటకు చెందిన గంగాధర్, నంద్యాల జిల్లా ప్యాపిలి గ్రామానికి చెందిన ఖాసీంవలిపై కేసు నమోదు చేశారు. వీరిలో పట్టుబడిన ముగ్గురు వాహన డ్రైవర్లను బుధవారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో బలరాముడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
మూడు వాహనాల డ్రైవర్ల అరెస్ట్
271 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం