
డ్రిప్, స్ప్రింక్లర్ల పంపిణీ వేగవంతం చేయాలి
అనంతపురం అగ్రికల్చర్: డ్రిప్, స్ప్రింక్లర్ల మంజూరు ప్రక్రియ మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఉద్యానశాఖ కమిషనర్ కె.శ్రీనివాసులు, ఓఎస్‌డీ ఎం.వెంకటేశ్వర్లు ఆదేశించారు. బుధవారం వారు విజయవాడ నుంచి ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి, ఏపీడీ బీసీ ధనుంజయ, ఎంఐ ఇంజనీర్లు, కంపెనీ డీసీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రస్తుత 2025–26లో 18 వేల హెక్టార్లు టార్గెట్ కాగా ఇప్పటి వరకూ 2,522 హెక్టార్లకు మాత్రమే రైతులకు మంజూరు చేయగా, ఇన్‌స్టాలేషన్ల ప్రక్రియ తక్కువగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు. దీనిపై పీడీ వివరణ ఇస్తూ... మరో 2 వేల హెక్టార్లకు మంజూరు చేయడానికి బీఓక్యూ, బీఎంసీ, రైతు వాటా పూర్తయిందని, వారం రోజుల్లోనే అడ్మినిస్ట్రేటివ్ శ్యాంక్షన్ తీసుకుని రైతులకు మంజూరు ఉత్తర్వులు ఇస్తామన్నారు. సీనియార్టీ వారీగా రిజిస్ట్రేషన్లను తీసుకుని ప్రాథమిక పరిశీలన చేపట్టి అర్హత జాబితా ప్రకారం మంజూరు ప్రక్రియ చేపట్టాలని కమిషనర్ సూచించారు. పరికరాలను త్వరితగతిన సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని, అదే సందర్భంగా నాణ్యత విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీ డీసీఓలను ఆదేశించారు. గతేడాదికి సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉన్న వాటిని వారం లోపు పూర్చి చేయాలన్నారు. వారం వారీ టార్గెట్లు నిర్ధేశించుకుని మంజూరు ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు.
ఉద్యానశాఖ కమిషనర్ శ్రీనివాసులు ఆదేశం