
దేశభక్తి చాటుదాం
● ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ
అనంతపురం కార్పొరేషన్: ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో పాల్గొని దేశ భక్తిని చాటి చెబుదామని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ పిలుపునిచ్చారు. సోమవారం అనంతపురంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ఇన్‌చార్జ్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా టవర్‌క్లాక్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 2 నుంచి 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరంగా యాత్ర, సెల్ఫీలు తదితర కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు దేశభక్తికి సంబంధించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్, జిల్లా పర్యాటక శాఖ అధికారి జయకుమార్, నగరపాలక సంస్థ ఎస్‌ఈ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పంద్రాగస్టు ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో అధికారులతో ఆయన సమీక్షించారు. ఏర్పాట్లలో పొరపాట్లకు తావివ్వకూడదన్నారు. ప్రొటోకాల్ ప్రక్రియను అనంతపురం ఆర్‌డీఓ, సీటింగ్, ఇతర ఏర్పాట్లను తహసీల్దారు చూడాలని ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణను డీఈఓ, డీఆర్‌డీఏ పీడీ చూడాలన్నారు. పథకాలకు సంబంధించి 14 స్టాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సురేష్, హౌసింగ్ పీడీ శైలజ, డీటీసీ వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.