
మా మొర ఆలకించండయ్యా..
అనంతపురం అర్బన్: తమ మొర ఆలకించి సమస్యలు పరిష్కరించండంటూ అధికారులకు ప్రజలు విన్నవించుకున్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ప్రజల నుంచి ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు అసిస్టెంట్ కలెక్టర్ సచిన్ రహర్ తదితరులు అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 460 వినతులు ప్రజల నుంచి అందాయి. కార్యక్రమం అనంతరం అర్జీల పరిష్కారంపై అధికారులతో ఇన్‌చార్జి కలెక్టర్ సమీక్షించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వారి సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపించాలన్నారు.
వినతుల్లో కొన్ని...
● భూమి సర్వే చేసి హద్దులు చూపించాలంటూ రెవెన్యూ సదస్సులో అర్జీ ఇచ్చినా ఇప్పటికీ సర్వే చేయలేదని గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామానికి చెందిన కేశవయ్య ఫిర్యాదు చేశాడు. తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు.
● తనకు ‘అన్నదాత సుఖీభవ’ డబ్బు అందలేదని నార్పల మండలం ముచ్చుకుంట గ్రామానికి చెందిన గంగాధర్ విన్నవించాడు. అర్హుల జాబితాలో పేరు ఉన్నా డబ్బు పడలేదని, తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
● అధికారుల తప్పిదంతో తమకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని అనంతపురం రూరల్ మండలం రుద్రంపేటకు చెందిన అరుణమ్మ వాపోయింది. ఎస్‌ఎస్‌ఏలో అవుట్‌సోర్సింగ్ అటెండర్‌గా ఉన్న తన భర్త ప్రవీణ్‌కుమార్ 2021లో అనారోగ్యంతో మరణించారని చెప్పింది. సీఎఫ్‌ఎంఎస్ లాగిన్ నుంచి ఆయన పేరు తొలగించకపోవడంతో ‘తల్లికి వందనం’ డబ్బు అందలేదని, పింఛను కూడా మంజూరు కాలేదని వాపోయింది. ఎస్‌ఎస్‌ఏలో ఉద్యోగం ఇస్తామని చెప్పిన అధికారులు న్యాయం చేయలేదని, తగిన చర్యలు తీసుకోవాలంది.
నడవలేని స్థితిలో ఉన్న తన బిడ్డ ఓబుళమ్మను చంక నెత్తుకున్న ఈమె పేరు జయమ్మ. కళ్యాణదుర్గం మండలం దుద్దకుంట గ్రామం. ఓబుళమ్మ కనీసం నడవలేని స్థితిలో ఉన్నా.. వీరికి భూమి ఎక్కువగా ఉందంటూ పింఛన్ మంజూరు చేయలేదు. వాస్తవంగా వారికి అంత భూమి లేదు. ఎక్కడో పొరపాటు జరిగిందని,సరిచూడా లని కోరినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో సమస్య చెప్పుకునేందుకు బిడ్డతో కలిసి జయమ్మ కలెక్టరేట్‌కు వచ్చింది.

మా మొర ఆలకించండయ్యా..