
కొనసాగుతోన్న వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్/తాడిపత్రిటౌన్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 16.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. తాడిపత్రిలో అత్యధికంగా 72.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే, నార్పల 66.4 మి.మీ, పుట్లూరు 58.8, యల్లనూరు 56.8, శెట్టూరు 55.8, గుమ్మఘట్ట 28.2, కంబదూరు 19.4, రాయదుర్గం 17.4, కణేకల్లు, పెద్దపప్పూరు, రాప్తాడు 10.2 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఆగస్టు సాధారణ వర్షపాతం 83.8 మి.మీ కాగా ఇప్పటికే 106.5 మి.మీ నమోదైంది. ఓవరాల్‌గా 146.7 మి.మీ గానూ ఈ సీజన్‌లో 28 శాతం అధికంగా 189.1 మి.మీ వర్షం కురిసింది. రాగల రెండు రోజులూ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
● భారీ వర్షాలకు తాడిపత్రి మండలంలో వంకలు పొంగిపొర్లాయి. బుగ్గ సమీపంలో నిర్మాణంలో ఉన్న 544డీ జాతీయ రహదారి వద్ద పాత రోడ్డు బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. దీంతో తాడిపత్రి– నంద్యాల మార్గంలో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడాయి. ఈ క్రమంలోనే 544డీ వద్ద మట్టి రోడ్డుపై వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ లారీ ఇరుక్కుపోయింది. ఆవులతిప్పాయ పల్లి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వంకను దాటేందుకు ప్రయత్నించిన జీపు కొట్టుకొని పోయింది. జీపు డ్రైవర్ కిందికి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. ఆలూరు కోన రంగనాథస్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి పడి భక్తుల వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. వర్షాలకు ఆలూరు కోన జలపాతం కొత్త శోభ సంతరించుకుంది.
తాడిపత్రిలో అత్యధికంగా
72.2 మి.మీ వర్షపాతం నమోదు

కొనసాగుతోన్న వర్షాలు