
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు అర్జీతో పాటు ఫోన్, ఆధార్ నంబర్లు తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. సమస్యల పరిష్కారం కోసం అర్జీలను ‘పరిష్కార వేదిక’లోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చని ఆయన తెలియజేశారు.
యాడికిలో భారీగా
రేషన్ బియ్యం పట్టివేత
యాడికి: ఓ రైస్ మిల్లులో భారీగా దాచిన రేషన్ బియ్యం బస్తాలను అధికారులు పట్టుకున్నారు. వివరాలు..యాడికి మండల కేంద్రానికి చెందిన బలరాముడు అలియాస్ బాలుకు యాడికి–పెద్దపేట గ్రామాల మధ్య రైస్ మిల్లు ఉంది. బలరాముడు కొంత కాలంగా ప్రజల నుంచి రేషన్ బియ్యం కొనుగోలు చేసి తన రైస్ మిల్లులో నిల్వ చేస్తున్నాడు. అనంతరం వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల కొందరు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఏఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున సీఐ ఈరన్న తమ సిబ్బందితో కలిసి రైస్ మిల్లుపై దాడి చేశారు. అక్కడ నిలిపిన లారీ, బొలెరోలో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి వాటిని యాడికి పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఎస్‌డీటీ మల్లేసు రాయలచెరువులోని వేబ్రిడ్జి కాటాలో తూకం వేయగా మొత్తం 337.5 క్వింటాళ్లు ఉన్నట్లు తేలింది. అయితే, బలరాముడు వద్ద ఇంకా రేషన్ బియ్యం ఉందని స్థానికుల ద్వారా సమాచారం అందడంతో సీఐ ఈరన్న, ఎస్‌ఐ రమణయ్య, సీఎస్‌డీటీ మల్లేసులు మరోసారి సాయంత్రం మిల్లును తనిఖీ చేశారు. ఈ క్రమంలోనే వారికి వందల సంఖ్యలో రేషన్ బియ్యం ప్యాకెట్లు కనిపించాయి. సీఎస్‌డీటీ వెంటనే రైస్ మిల్లును సీజ్ చేశారు. తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి అక్కడికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. సోమవారం రైస్ మిల్లులోని రేషన్ బియ్యాన్ని గుంతకల్లులోని గోడౌన్‌కు తరలిస్తామని తెలిపారు. అంతవరకు రైస్ మిల్లు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు.
జిల్లాకు చేరిన ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు 675 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ (ఎంవోపీ) సరఫరా అయినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ ఆదివారం తెలిపారు. ఆదివారం స్థానిక ప్రసన్నాయపల్లి రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా చేరిన మహాధన్ కంపెనీకి చెందిన ఎంఓపీని ఆయన పరిశీలించి, మాట్లాడారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు వీటిని సరఫరా చేయనున్నామని పేర్కొన్నారు.

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’