
మెరిట్‌కా? సిఫారసులకా?!
అనంతపురం ఎడ్యుకేషన్: ఏడాదికి పైగా ఖాళీగా ఉన్న సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ గుట్టుగా సాగుతోంది. ఖాళీగా ఉన్న ఆరు సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీలో భాగంగా రెండో సారి ఈ ఏడాది జూన్ 24న నోటిఫికేషన్ జారీ చేశారు. అదే నెల 30వ తేదీకి గడువు విధించారు. మొత్తం 172 దరఖాస్తులు అందాయి. వచ్చిన దరఖాస్తులన్నీ సమగ్రశిక్ష కార్యాలయంలోనే మూలుగుతున్నాయి తప్ప కనీసం స్క్రూటినీ కూడా చేయలేదు. ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఎటూ తేల్చుకోలేకపోయారనే ఆరోపణలున్నాయి. పత్రికల్లో వరుస కథనాలు రావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ క్రమంలో గత నెలలో గుట్టు చప్పుడు కాకుండా దరఖాస్తులు స్క్రూటినీ చేశారు. అవి కూడా సమగ్రశిక్ష కార్యాలయంలో కాకుండా కలెక్టరేట్‌లో ట్రైనీ కలెక్టర్ సమక్షంలో ఈ ప్రక్రియ కొనసాగడం గమనార్హం.
అంతులేని రహస్యం..
దరఖాస్తులు స్క్రూటినీ చేసి ఒక్కొక్కరికీ వచ్చిన మార్కులు నమోదు చేసిన అధికారులు అవి బయటపడకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. ముందుగా ఇంటర్వ్యూకు ఎంపికై న అభ్యర్థులతో పాటు వారికి వచ్చిన మార్కులను అధికారిక వెబ్‌సైట్‌లో ప్రదర్శిస్తామని చెప్పినా... తర్వాత ఏమి జరిగిందో ఏమోకానీ పేర్లు తప్ప మార్కులు ప్రదర్శించలేదు. మార్కులను బహిర్గతంచేయలేదు. తమకు దక్కిన మార్కులు తెలుసుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. దరఖాస్తుల స్క్రూటినీలో పాల్గొన్న ఎంఈఓలు, హెచ్‌ఎంలు ఎక్కడా నోరు జారగకుండా జాగ్రత్త పడి చివరకు 47 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరందరికీ సోమవారం (నేడు) కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు ఉంటాయంటూ మూడు రోజుల క్రితం సమగ్రశిక్ష ఉద్యోగులు స్వయంగా ఫోన్లు చేసి సమాచారం అందించారు. అయితే ఏమి జరిగిందో ఏమోకాని సోమవారం 25 మందికి, మంగళవారం 22 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఆదివారం మార్పు చేశారు. ఈ మేరకు అభ్యర్థులకు సమాచారం అందింది. అధికారిక వెబ్‌సైట్‌లోనూ ఉంచారు.
ఆ మార్కులే కీలకం..
ఇదిలా ఉండగా అధికార పార్టీ నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో ఇంటర్వ్యూకు కేటాయించిన 15 మార్కులు కీలకంగా మారనున్నాయి. కాగా, ఇప్పటి వరకూ చేసిన స్క్రూటినీలో అత్యధిక మార్కులు 54 వచ్చినట్లు తెలిసింది. ఈ మార్కులకు రెండో నంబరులోని అభ్యర్థికి వచ్చిన మార్కుల మధ్య బాగా తేడా ఉన్నట్లు సమాచారం. ఈ లెక్కన మిగిలిన వారికి 50లోపే మార్కులు వచ్చి ఉంటాయని తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్వ్యూ మార్కులపైనే ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనా మెరిట్‌కు పట్టం కడతారా? ప్రజాప్రతినిధుల సిఫారుసలకు తలొగ్గుతారా? అనేది వేచి చూడాలి.
నేడు, రేపు ‘సమగ్ర’ సెక్టోరియల్
పోస్టుల ఇంటర్వ్యూలు
కీలకం కానున్న ఇంటర్వ్యూ మార్కులు