
సాక్షి, అనంతపురం: అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయం పట్టుకుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 48 గంటల్లో ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఆయన్ని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్టిమేటం జారీ చేశారు.


48 గంటల గడువు ముగియడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముట్టడిస్తారన్న భయం.. ఎమ్మెల్యే దగ్గుపాటికి పట్టుకుంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తూ.. బారికేడ్లు, చెక్ పోస్టులు పెట్టారు.

అనంతపురంలో ఉద్రిక్తత..
ఈ క్రమంలో అనంతపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే దుగ్గుపాటి ప్రసాద్ ఇంటి ముట్టడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు-జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ.. ఎమ్మెల్యే దగ్గుపాటికి వ్యతిరేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
